నడిచింది లేదు.. ఊడ్చింది లేదు

ABN , First Publish Date - 2023-03-25T23:05:51+05:30 IST

కార్మికులపై పనిభారం తగ్గించడం.. పారిశుధ్యం కోసం ఖర్చు చేస్తున్న నిధులను ఆదా చేయడం కోసం వనపర్తి మునిసిపాలిటీ రెండున్నరేళ్ల క్రితం స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

నడిచింది లేదు.. ఊడ్చింది లేదు
వనపర్తి మునిసిపాలిటీలో తగులబడుతున్న స్వీపింగ్‌ మిషన్‌ వాహనం(ఫైల్‌)

వనపర్తి మునిసిపాలిటీ కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌ దుస్థితి ఇది

కొటేషన్‌ లేకుండానే రూ.65 లక్షలతో టీఎస్‌ ఆగ్రోస్‌ నుంచి కొనుగోలు

ప్రారంభం నుంచే రిపేర్లు.. రోడ్ల విస్తరణతో మూలకు..

తాజాగా మిషన్‌కు నిప్పు పెట్టిన ఆగంతకులు..

వనపర్తి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): కార్మికులపై పనిభారం తగ్గించడం.. పారిశుధ్యం కోసం ఖర్చు చేస్తున్న నిధులను ఆదా చేయడం కోసం వనపర్తి మునిసిపాలిటీ రెండున్నరేళ్ల క్రితం స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మిషన్‌ పనితీరు మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఉదాసీన వైఖరి కారణంగా పట్టుమని పది రోజులు కూడా ఏకధాటిగా నడవకుండా మిషన్‌ పలుమార్లు మరమ్మతులకు గురైం ది. మరమ్మతులు గురైన సందర్భాల్లో మునిసిపాలిటీ అధికారులు, పాలకవర్గంపై పలు విమర్శలు వచ్చాయి. కొత్త మిషన్‌ కొనుగోలు చేస్తున్నామనే పేరుతో పాత మిషన్‌ కొనుగోలు చేశారని, అందుకే ఎప్పుడూ రిపేర్లకు గురవుతుందని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. వారి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా పలు ఘటనలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం ఆ మిష న్‌కు ఆగంతకులు నిప్పు పెట్టడంతో మిషన్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు మిషన్‌ పని చేస్తుందా? లేదా? చేస్తే మర మ్మతులకు ఎంత ఖర్చవుతుంది?, అసలు నిప్పు పెట్టిన వారెవరు?, ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలు ఎవరు నిప్పు పెట్టారు? మరిన్ని నిధులను కాజేసే ప్రయత్నంలోనే ఈ తప్పులు చేశారా? అనే ప్రశ్నలు పుర ప్రజలు, కొందరు కౌన్సిలర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. మిషన్‌ పని చేయాలంటే ముంబై లేదా ఢిల్లీ నుంచి టెక్నీషియన్లు రావాల్సి ఉంటుంది. వారు పరిశీలిం చిన తర్వాత ఎంత ఖర్చవుతుంది? దాని తిరిగి వినియోగంలోకి తేవచ్చా? లేదా అనేది తేల్చనున్నారు. అయితే స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి అది పని చేసింది తక్కు వ.. దాని కోసం ఖర్చు చేసిన మొత్తం ఎక్కువగా అన్నట్లు పరిస్థితి తయారైంది. అధికారులు కూడా వాహ నానికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోలేదని, ఎవరో కావాలనే చేసినట్లుగా భావిస్తున్నామని అన్నట్లుగా తెలుస్తోంది. మిషన్‌ నిర్వహణ ఖర్చుల విషయంలో అనుమానాలు ఉండటం, ప్రస్తుతం మిషన్‌ తగుల పడటం యాధృచ్ఛికంగా జరుగలేదని, కొందరు కావాలనే చేసిన కుట్ర అనే భావన పురఃప్రజల్లో వ్యక్తమవుతోంది.

రూ. 65 లక్షలతో కొనుగోలు

వనపర్తి మేజర్‌ మునిసిపాలిటీగా ఉంది. సుమారు లక్ష జనాభా ఉన్న మునిసిపాలిటీలో రోజూ పారిశుధ్యం విషయంలో కార్మికులపై పనిభారం అధికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో 2020 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వ మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ శాఖ ద్వారా సర్క్యూలర్‌ 159ని విడుదల చేసి, టీఎస్‌ ఆగ్రోస్‌ ద్వారా మేజర్‌ మునిసిపాలిటీల్లో స్వీపింగ్‌ మిషన్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వనపర్తి మునిసిపాలిటీ అధికారులు కొటేషన్‌/టెండర్‌ లేకుండా రూ.65 లక్షల వ్యయంతో టాటా కంపెనీ నుంచి సెప్టెంబర్‌ 17, 2020న స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేశారు. సాధారణంగా ఏ వస్తువు లేదా యంత్రం కొనుగోలు చేసేటప్పుడు మునిసిపాలి టీలో సంబంధిత డీలర్ల నుంచి కొటేషన్‌లు స్వీకరిస్తారు. ఏ డీలర్‌ తక్కువకు ఆ యంత్రం ఇస్తే వారి నుంచి కొను గోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. లేదా మిషన్‌ కొనుగోలుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించిన తర్వాత తక్కువ కోట్‌ చేసిన వారికి అప్పగిస్తారు. కానీ ప్రభుత్వమే సర్క్యులర్‌ జారీ చేయడంతో కొటేషన్‌/ టెండర్‌ లేకుండానే అధికారులు మిషన్‌ కొనుగోలు చేశా రు. ఇప్పటికి దాదాపు రెండున్నర ఏళ్లవుతుంది. కానీ పట్టుమని పది రోజులు కూడా ఈ మిషన్‌ను ఏకదాటిగా నడపలేదు. రోడ్ల విస్తరణ సాకుగా చూపుతున్నప్పటికీ కొత్తకోట, పెబ్బేరు రోడ్లలోనైనా ఈ మిషన్‌ నడిపించే అవసరం ఉంది. రోజుకు ఎనిమిది గంటలపాటు మిషన్‌ నడిస్తేనే నిర్వహణ ఖర్చులు సరిపోతాయి. తక్కువ నడిస్తే మిషన్‌ వల్ల ఆర్థిక భారం అవుతుంది. దీంతో ఆరు నెలల నుంచి మిషన్‌ను మూలన పడేశామని అధికారులు చెబుతున్నప్పటికీ.. అంతకుముందు కూడా మిషన్‌ నడిచిన దాఖలాలు పెద్దగా లేవు. ఆ మిషన్‌కు నెలకు రూ.95 వేల నిర్వహణ ఖర్చులను కంపెనీకి చెల్లిస్తే కంపెనీ డ్రైవర్‌, హెల్పర్‌ను కేటాయించడంతో పా టు బ్రష్‌లను సమకూర్చి దాన్ని నిర్వహణ బాధ్యత తీసు కుంటుంది. అయితే ఇప్పటివరకు ఆ మిషన్‌ నడిచేం దుకు సుమారు రూ.6 లక్షల ఖర్చయిందని అధికారులు చెబుతున్నారు. కానీ అంత మొత్తంలో ఖర్చు జరిగే అవ కాశం లేదనే విమర్శలు ఉన్నాయి. నిర్వహణ ఖర్చులు కూడా కంపెనీకి చెల్లించకపోవడంతో వాహన డ్రైవర్‌ మునిసిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధి వ్యక్తిగత డ్రైవర్‌ గా జాయిన్‌ అయ్యారు.

కాసుల కక్కుర్తే కారణమా?

స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి దాని విషయంలో అధికారులు, పాలక వర్గంపై విమర్శలు వ్యక్తమవు తూనే ఉన్నాయి. కొనుగోలు చేసిన కొద్ది రోజులకే మిషన్‌ పార్ట్స్‌ కొన్ని దెబ్బతిన్నాయి. దీంతో పాత మిషన్‌ కొనుగోలు చేసి, కొత్త మిషన్‌ కొనుగోలు చేసినట్లుగా అధికారులు, పాలకవర్గం నిధులు కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే మునిసిపాలిటీ తీర్మానం చేసే సమయాల్లోనూ మిషన్‌ ధర విషయంలో గందరగోళ పరిస్థితి ఉంది. ఒక మిషన్‌ కొనుగోలు చేసేందుకు రెండుసార్లు తీర్మానాలు చేశారు. ఒకసారి రూ.45 లక్షలకు తీర్మానం చేయగా, మరోసారి రూ.20 లక్షలకు తీర్మానం చేశారు. అంటే మిషన్‌ ధర తెలుసుకోకుండానే తీర్మానాలు చేశారా?, మొదటి తీర్మానం చేసేటప్పుడు మిషన్‌ ధర తెలియదా? లేదా నిధులు కాజేసేందుకు రెండుసార్లు తీర్మానం చేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అలాగే కంపెనీకి రెండు విడతలుగా డబ్బులు చెల్లించారు. తీర్మానం రూ.65 లక్షలకు చేసి, ఒకసారి రూ.40.95 లక్షలు, మరోసారి రూ.18.20 లక్షల చొప్పున రూ.59.15 లక్షలు కంపెనీకి చెల్లించారు. దీంతోపాటు ఇప్పటివరకు నిర్వహణ ఖర్చులు రూ.6 లక్షల వరకు అయినట్లు అధికారులు తెలుపుతున్నారు. కానీ అసలే నడవని మిషన్‌కు అంతమొత్తంలో నిర్వహణ ఖర్చు ఎలా అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు దానికి రిపేర్లు కాగా.. తాజాగా నిప్పు పెట్టడం మూడోసారి మరమ్మతుగా చెప్పొచ్చు. ఆరు నెలల నుంచి నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడంతో మూలన పడేసిన మిషన్‌కు ఎవరు నిప్పు పెట్టారనే విషయం తేలాల్సి ఉంది. బ్యాటరీ పూర్తిగా డౌన్‌ అయిన మిషన్‌లో షార్ట్‌సర్క్యుట్‌ అయ్యే అవకాశాలు లేవు. అలాగే ఆ ప్రాంతంలో పెద్దగా చెత్త ఉండి, అది అంటుకోవడం ద్వారా మంటలు చెలరేగాయనే పరిస్థితులు కూడా లేవు. మరి మిషన్‌ ఎలా తగలబడిపోయిందో తెలియాల్సి ఉంది. రోడ్ల విస్తరణ పూర్తయిన తర్వాత ఈ మిషన్‌ కొనుగోలు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ రోడ్ల విస్తరణ మధ్యలో ఉన్నప్పుడే హడావిడిగా మిషన్‌ కొనుగోలు చేయడం, అది మునిసిపాలిటీకి గుదిబండగా మారడం పుర అధికారులు, పాలకవర్గం పాలనా తీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

పోలీసులకు ఫిర్యాదు చేశాం

రోడ్లను ఊడ్చేందుకు ఆధునాతన టెక్నాలజీతో రూ పొందించిన మిషన్‌ను 2020లో మునిసిపాలిటీ కొను గోలు చేసింది. దీనివల్ల కార్మికులపై పనిభారం తగ్గడంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందని ఉద్దేశం. అయితే మిషన్‌ ఇప్పటివరకు రెండుసార్లు మరమ్మతులకు గురైంది. ఆరు నెలలుగా నడవడం లేదు. తాజాగా నిప్పంటుకున్న ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కంపెనీ ప్రతినిధులకు కూడా మరమ్మతు కోసం సమాచారం అందించాం. వారు వచ్చి చూస్తే మిషన్‌ మరమ్మతుకు ఎంత ఖర్చవుతుందనేది తెలుస్తుంది.

- విక్రమసింహారెడ్డి, కమిషనర్‌, వనపర్తి

Updated Date - 2023-03-25T23:05:51+05:30 IST