పంట చేతికందేనా?

ABN , First Publish Date - 2023-03-05T23:00:48+05:30 IST

యాసంగి వరి సాగు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. విద్యుత్‌ కోతలు మొదలవడం, ఎండలు పెరగడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం వంటి పరిస్థితులు వారిని కలవరపెడుతున్నాయి.

పంట  చేతికందేనా?

యాసంగి వరి సాగుపై రైతుల్లో ఆందోళన

క్రమంగా తగ్గుతున్న భూగర్భ జలాలు

గత నెలతో పోలిస్తే 1.17 మీటర్ల లోతుకు..

మొదలైన విద్యుత్‌ కోతలు

గతేడాది కంటే 79 శాతం అదనంగా సాగైన వరి

ఏప్రిల్‌ రెండు, మూడు వారాలు గట్టెక్కితే చాలంటోన్న అన్నదాతలు

యాసంగి వరి సాగు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. విద్యుత్‌ కోతలు మొదలవడం, ఎండలు పెరగడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం వంటి పరిస్థితులు వారిని కలవరపెడుతున్నాయి. ఈ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో వరి సాగు దాదాపు 79 శాతం పెరిగింది. దాంతో అదే స్థాయిలో భూగర్భ జలాలు, విద్యుత్‌ వినియోగం హెచ్చింది. ఎండలు పెరుగుతున్న కొద్దీ నీటి వినియోగం పెరుగుతుండగా, భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలవుతున్న ఎనిమిది గంటల విద్యుత్‌ కోతలతో ఇప్పుడు ఇబ్బందులు లేకున్నా.. ముందు ముందు ప్రభావం పడుతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి

ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగిలో వరిసాగు గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో 98,826 ఎకరాల్లో వరి సాగవగా, ఈయేడాది గణనీయంగా పెరిగి 4,77,889 ఎకరాలకు చేరింది. గతేడాది కంటే 3.79 లక్షల ఎకరాలు అదనంగా సాగు పెరగడం ఒక రికార్డుగా వ్యవసాయ అధికారులు భావి స్తున్నారు. ప్రధానంగా వనపర్తి జిల్లాలో 1.26 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1.06 లక్షల ఎకరాలతో పాటు, నారా యణపేట జిల్లాలోనూ అనూ హ్యంగా 97 వేల ఎకరాల్లో సాగు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 94 వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 5 3వేల ఎకరాల్లో వరి సాగయ్యింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు, భీమా, సంగంబండ, కోయిల్‌సాగర్‌, జూరాల ప్రాజెక్టుల కింద ప్రత్యక్షంగా సాగుతో పాటు ఈ పథకాల ద్వారా సాగు నీటిని చెరువుల్లో నింప డంతో భూగర్భ జలాలు పుష్కలంగా అందుబా టులోకి వచ్చి, వరి సాగు పెరగడానికి దో హదపడింది. వీటికి తో డు ఈ సీజన్‌లో పంటల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి అధి కారిక సూచన చేయక పోవడం కూడా సాగు పెరగ డానికి కారణంగా తెలుస్తోంది. గతేడాది యాసంగిలో వరి వేయ వద్దని ప్రభుత్వం సూచించడంతో చాలావరకు నియంత్రణ పాటించారు.

పెరిగిన భూగర్భ జలాల వినియోగం

యాసంగి వరి సాగు విస్తీర్ణం పెరగడం, రోజు రోజుకు ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాల వినియోగమూ భారీగా పెరిగింది. బోరు బావులపైనే ఆధారపడి 90 శాతం వరిసాగు చేపట్టిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో భూగర్భ జల మట్టాలు క్రమంగా పడిపోతున్నాయి. వినియోగం ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని రైతులు చెబుతున్నారు. ఈ జిల్లాలో గత నెలలో 5.76 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటే ఈ నెలలో 6.93 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఒక్క నెలలో సగటున 1.17 మీటర్ల లోతుకు మట్టాలు పడిపోయాయి. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో మట్టాలు తగ్గినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఎండలు పెరుగుతున్న నేపథ్యానికి తోడు, భూగర్భ జలాల వినియోగం పెరుగుతుందని, దీనికి తోడు గతేడాది కంటే సాగు దాదాపు నాలుగు రెట్లు పెరగడంతో ఆమేర నీటి వినియోగం ఉండటంతో ఆ ప్రభావం బోర్లపై పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుతం వరి పైర్లు చిరు పొట్టదశలో ఉన్నాయని, ఏప్రిల్‌ మూడోవారం వరకు పంటకు నీరివ్వాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. అప్పటివరకు భూగర్భజలాలు ఇంకెంత లోతుకు వెళతాయోననో అంశంపై రైతుల్లో కలవరం కనిపిస్తోంది.

Updated Date - 2023-03-05T23:00:48+05:30 IST