Share News

సాగునీరే.. మొదటి సవాల్‌

ABN , First Publish Date - 2023-12-10T22:50:49+05:30 IST

కొత్త ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లాలో సాగునీరు మొదటి సవాల్‌గా మారనుంది. వానాకాలంలో సరిగా వర్షాలు కురవనందున ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌కు నీటిని అందించడంపై సందిగ్ధం నెలకొంది.

సాగునీరే.. మొదటి సవాల్‌
పెద్దమందడి మండలం చిన్నమందడిలో యాసంగి వరి సాగు కోసం తుకం పోసిన రైతు

మంత్రి, ఎమ్మెల్యేలు మొదట చేయాల్సిన పని ఇదే..

ఈ ఏడాది ఆశించినంతగా నమోదు కాని వర్షపాతం

ప్రాజెక్టుల్లో రోజు రోజుకు తగ్గుతున్న నీటి నిల్వలు

ఐఏబీ సమావేశం నిర్వహిస్తేనే నీటి వినియోగంపై స్పష్టత వచ్చే అవకాశం

ఇప్పటికే యాసంగి సాగును ప్రారంభించిన రైతులు

వనపర్తి/గద్వాల, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): కొత్త ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లాలో సాగునీరు మొదటి సవాల్‌గా మారనుంది. వానాకాలంలో సరిగా వర్షాలు కురవనందున ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌కు నీటిని అందించడంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది వర్షపాతం ఆశించినంతగా నమోదు కాలేదు. ఎగువ నుంచి కూడా వరద రాలేదు. ఈ కారణంగా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండలేదు. వానాకాలం సీజన్‌లోనే వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల రైతులు పంటల సాగులో పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చివరి ఆయకట్టు రైతులు నీరందక పం టలను పశువులకు మేతగా వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, పాత ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడటం చకచక జరిగిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో పాటు జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు, మిగతా ఎమ్మెల్యేలకు యాసంగి సాగు మొదటి గండంగా మారనుంది. ఏటా యాసంగి సాగు ప్రారంభించే ముందే.. ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను మదింపు చేసుకుని, ఎక్కడి వరకు నీరివ్వాలనే విషయంపై ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డు సమావేశం కావాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో పడి పాత ప్రభుత్వం ఆ సమావేశాన్ని నిర్వహించ లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం శనివారం పూర్తయ్యింది. తర్వాత సమావేశాలు ఈ నెల 14కు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పటికే ఐఏబీ సమావేశం ఆలస్యమైనందున త్వరితగతిన సమావేశం నిర్వహిం చాల్సి ఉంది. యాసంగి సాగు కోసం రైతులు ఇప్పటికే నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే అవకాశాలు లేకపోవడంతో ఎక్కడి వరకు సాగునీరు ఇస్తారు?, ఏ పద్ధతిలో నీటి సరఫరా జరుగుతుంది అనే విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు కూడా మంత్రి, ఎమ్మెల్యేలతో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు కోరుతున్నారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కాలువల పనులపై కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. మెజారిటీ పెండింగ్‌ పనులు వేసవిలో పూర్తి చేస్తే వానాకాలం సీజన్‌ వచ్చే సరికి.. సాగునీటి లక్ష్యాన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.

ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు..

ఉమ్మడి జిల్లాకు సాగు నీరు అందించే ప్రాజెక్టుల్లో జూరాల, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి, రాజీవ్‌ బీమా ఫేజ్‌ 1, 2, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది అన్ని జి ల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదైంది. ఎగువన ఉన్న కర్ణాటకలో వర్షాలు కురవని కారణంగా.. వరద రోజులు కూడా తక్కువగా నమోదయ్యాయి. జూరాల ప్రాజెక్టు పూరి ్తస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో కాలువల ద్వారా వాడుకోదగిన నీటి నిల్వ 4.322 టీఎంసీలు మాత్రమే. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రస్తుతం ఎగువ నుంచి 398 క్యూసెక్కుల వరద వస్తోంది. కానీ అది కూడా కొనసాగే అవకాశాలు లేవు.. ఈ ప్రాజెక్టుపై ఎత్తిపోతల పథకాలు ఎక్కు వగా ఉన్నప్పటికీ.. వాటికి వరద రోజుల్లోనే నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఒక్క కోయిల్‌ సాగర్‌కు మాత్రమే నికర జలాలు వాడుకోవచ్చు. ప్రస్తుతం ఎడమ కాలువకు 390 క్యూసెక్కులు, కుడి కాలువకు 161 క్యూసెక్కులు నారుమళ్ల సాగు కోసం విడుదల చేస్తున్నారు. అయితే సాగు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత నీటి విడుదలను పెంచాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. తాగునీటికి ఢోకా లేకపోతేనే సాగుకు నీటిని వాడుకునే వీలుంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రధానంగా సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.65 టీఎంసీలు, ప్రస్తుతం అంత నిల్వలు లేవు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,132 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. రాజీవ భీమా రెండు దశల్లో ఉన్న రంగసముద్రం, శంకరసముద్రం, సంగంబండ, రిజర్వాయర్లలో కూడా ఆశించిన నీటి నిల్వలు లేవు. నెట్టెంపాడు కింద గూడెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లలో సీపేజీ కారణంగా ఏటా తక్కువ మొత్తంలో నీటిని నింపుతున్నారు. ఈ కారణంతో యాసంగిలో నీటి విడుదలకు పెద్ద అవకాశాలు లేవు.

అడుగంటుతున్న శ్రీశైలం..

వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మెజారిటీ ఆయకట్టు సాగుకు శ్రీశైలంలో నీటి నిల్వలే ఆధారం. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకోలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, 100 టీఎంసీలు కూడా చేరుకోలేదు. వాస్తవానికి వరద వస్తున్నప్పటి నుంచే శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటి పంపింగ్‌ను మొదలుపెట్టారు. కానీ వానాకాలం సీజన్‌లో వరి ఎక్కువగా సాగుకావడం వల్ల ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రాజెక్టులో కేవలం 58 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నా, ప్రస్తుతం నీటి పంపింగ్‌ కొనసాగుతోంది. హంద్రీనివాకు 960 క్యూసెక్కుల పంపింగ్‌ జరుగుతుండగా, కల్వకుర్తికి 1,132 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా కరెంట్‌ ఉత్పత్తికి 1,529 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నీటి నిల్వలు 50 టీఎంసీల దిగువకు తగ్గితే.. కల్వకుర్తి పంపులకు నీరు అందే అవకాశం తక్కువగా ఉంటుంది. 2022 సంవత్సరంలో కూడా ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ.. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా పోటీపడి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల ప్రాజెక్టుల్లో నీరంతా దిగువకు వెళ్లిపోయి ఆ ఏడాది యాసంగి సీజన్‌లో నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం సాగునీటికి కటకట ఉన్నప్పటికీ ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా ఇంకా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తుండటం ఇబ్బందిగా మారనుంది. ఇప్పటికైనా విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేసి.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సాధ్యమైనంత ఎక్కువగా నీటిని పంపింగ్‌ చేసుకుంటేనే రైతులకు కొంత ఉపశమనంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Updated Date - 2023-12-10T22:50:50+05:30 IST