జూలైలో చేరికల సభ

ABN , First Publish Date - 2023-06-26T22:52:16+05:30 IST

కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొలిక్కివస్తోంది. దాదాపు ఆరేడు నెలలుగా కొనసాగుతున్న చర్చల దశ ముగిసింది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తనయుడు డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గేను సోమవారం ఢిల్లీలో కలిసి, కాంగ్రెస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

జూలైలో చేరికల సభ
ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తదితరులు

ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గేను కలిసిన జూపల్లి

మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, మేఘారెడ్డి కూడా..

అనుచరగణంతో సహా కాంగ్రెస్‌ ప్రముఖులతో జూపల్లి చర్చలు

14 లేదా 16న భారీ బహిరంగ సభ నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌

మహబూబ్‌నగర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొలిక్కివస్తోంది. దాదాపు ఆరేడు నెలలుగా కొనసాగుతున్న చర్చల దశ ముగిసింది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తనయుడు డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గేను సోమవారం ఢిల్లీలో కలిసి, కాంగ్రెస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మాజీమంత్రి డాక్టర్‌ చిన్నారెడ్డి, ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, చల్లా వంశీచంద్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లురవి, తదితర కీలక నాయకుల సమక్షంలో రాహుల్‌ గాంధీతో సమావేశమైన వీరు జూలైలో పాలమూరులో నిర్వహించే బహిరంగ సభలో అనుచరులతో సహా కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతామని, ఈ సభకు రాహుల్‌గాంధీ రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు ముందుకొచ్చిన నాయకులకు రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్సే బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా భావించి..

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గత ఆరు నెలలుగా ఆత్మీయ సమ్మేళనాలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన మాజీమంత్రి జూపల్లి తన వర్గీయులతో సహా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దఫదఫాల చర్చలు జరిపారు. బీఆర్‌ఎస్‌ వ్యతిరేకశక్తుల ఏకీకరణ నినాదం, ఆ పార్టీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఏకైకలక్ష్యంగా ప్రకటించిన ఈ నాయకులు ఆమేరకు కాంగ్రెస్సే బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని ఆయన రాజకీయ ప్రత్యర్థిగా భావించే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయానా రెండుసార్లు కలిసి, పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అంతేకాక ఆయన్ను స్వయంగా వెంటబెట్టుకొని ఢిల్లీ తీసుకెళ్లి రాహుల్‌గాంధీని కలిపారు. ఈపరిణామాలతో పాలమూరుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించిన విషయం స్పష్టమవుతోంది. ఈ నాయకులంతా కాంగ్రెస్‌లో చేరే సందర్భంలో జూలై 14 లేదా 16 తేదీల్లో పాలమూరు ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గేను రావాల్సిందిగా రేవంత్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా కీలక నాయకులు ఆహ్వానించారు. రాహుల్‌, మల్లికార్జునఖర్గే ఇచ్చే సమయం మేరకు ఈ రెండు తేదీల్లో ఏదో ఒకరోజు మహబూబ్‌నగర్‌ లేక నాగర్‌కర్నూల్‌లలో భారీ ఎత్తున చేరికల సభ నిర్వహిస్తామని నాయకులు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని, ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి ఏంచేయాలో అది చేస్తున్నామని కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు పేర్కొంటుండడం క్యాడర్‌లో జోష్‌ నింపుతోంది.

Updated Date - 2023-06-26T22:52:16+05:30 IST