గ్రామాల్లో మెరుగుపడిన పారిశుధ్యం
ABN , First Publish Date - 2023-05-25T23:53:33+05:30 IST
మల్టీ పర్పస్ వర్కర్ల ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడిందని నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ రాజేశ్వర్ అన్నారు. ధరూరు మండల పరిధిలోని గూడెందొడ్డి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు.

- నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ రాజేశ్వర్
ధరూరు, మే 25 : మల్టీ పర్పస్ వర్కర్ల ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడిందని నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ రాజేశ్వర్ అన్నారు. ధరూరు మండల పరిధిలోని గూడెందొడ్డి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. పల్లెప్రకృతి కార్యక్రమంతో గ్రామంలో వచ్చిన మార్పులను పరిశీలించారు. ప్రకృతి వనం, వైకుంఠధామాలను తనిఖీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి ద్వారా సాధించిన విజయాలతో ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు. గ్రామాల్లో మరుగు దొడ్ల నిర్మాణం 80 శాతం వరకు పూర్తయ్యిం దని, మిగతావి కూడా పూర్తి చేసేందుకు గ్రామ స్థులు సహకరించాలన్నారు. గ్రామ పంచాయ తీలకు ట్రాకర్లను ఇవ్వడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో సఫలీకృతం అయ్యామని చెప్పారు. వారి వెంట ఎంపీడీవో జబ్బార్, ఏపీడీ నాగేంద్రం, సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి, ఎంపీవో కృష్ణమూర్తి ఉన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కేటీదొడ్డి : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ) హెచ్‌వోడీ ప్రొఫెసర్ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని వెంకటాపురం, ఈర్లబండ గ్రామాల్లో అడిషనల్ పీడీ, డీఆర్‌డీవో నాగేందర్‌లతో కలిసి పర్యటిం చారు. ఈర్లబండ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్‌లను పరిశీలించారు. గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పారిశుధ్య కార్మికులు సక్రమంగా పని చేస్తున్నారా, చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారా, మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారా తదితర విషయాలపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటాపురంలో రైతు గోపికి చెందిన పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన మామిడితోటను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో మహ్మద్ అజహర్‌మొయిద్దీన్, ఎంపీవో సయ్యద్‌ఖాన్ తదితరులున్నారు.