క్రిస్టియన్‌ మైనారిటీలకూ సాయం

ABN , First Publish Date - 2023-08-04T23:34:16+05:30 IST

బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారికి వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుండగా, అదే తరహాలో 100 శాతం సబ్సిడీతో మైనారిటీలకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

క్రిస్టియన్‌ మైనారిటీలకూ సాయం
వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం

దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 14 వరకు గడువు

ముస్లిం మైనారిటీలు అప్లై చేసుకోవద్దని వెల్లడి

బీసీలకు, గతంలో దరఖాస్తు చేసుకున్న ముస్లిం మైనారిటీలకు నేటికీ అందని సాయం

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా/ గద్వాల క్రైం, ఆగస్టు 4: బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారికి వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుండగా, అదే తరహాలో 100 శాతం సబ్సిడీతో మైనారిటీలకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అందుకోసం గత నెల 31న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ఏడాది సబ్సిడీ రుణాల కోసం ముస్లిం మైనారిటీల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, ఈసారి ముస్లింలు కాకుండా క్రిస్టియన్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అందుకు ఈనెల 14 వరకు గడువు ఇచ్చింది.

నిబంధనలు ఇవే ..

రూ.లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు 21 నుంచి 55 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు అర్హులు. తహసీల్దార్‌ నుంచి జారీ చేయబడిన బీసీ సీ కుల ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, చర్చి పాస్టర్‌ మంజూరు చేసిన బాప్తిస్ట్‌ సర్టిఫికెట్లతో డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. టీఎస్‌వోబీఎంఎంఎస్‌. సీజీజీ. జీవోవి.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వార్షిక ఆదాయం గ్రామీణులు అయితే రూ.లక్షా 50 వేల లోపు, పట్టణ వాసులైతే రూ.2 లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే సాయం అందిస్తారు. ఆధార్‌ కార్డులో ఉన్న చిరునామానే ప్రామాణికంగా తీసుకుంటారు.

క్రిస్టియన్‌ మైనార్టీలే దరఖాస్తు చేసుకోవాలి

రూ.లక్ష ఆర్థిక సాయం కోసం క్రిస్టియన్‌ మైనారిటీలు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌ జారీ చేశారు. మైనారిటీ కార్పొరేషన్‌ 80 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు గతేడాది ముస్లింల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 1,885 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న ముస్లీంలకు తొలి విడతలో రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే క్రిస్టియన్‌ మైనార్టీలకు రెండో విడతలో గానీ ఆ తరువాత కానీ సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తు న్నట్లు తెలుస్తోంది. అయితే మైనార్టీలకు ఆర్థిక సాయం అందించడానికి విధివి ధానాలు ఇప్పటికీ ఖరారు కాలేదు. నియోజకవర్గానికి 100 మందికిపైగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్ధిక సహాయం అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

బీసీ కులాలకు పూర్తికాని తొలి విడత సాయం

బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారికి వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పి, జూన్‌ 20వ తేదీ వరకు రెండు వారాల పాటు దరఖాస్తులు స్వీకరించింది. ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి జూలై 15వ తేదీ నుంచి 25వ తేదీలోపు తొలి విడత చెక్కులు అందిస్తామని పేర్కొంది. ఇప్పటి వరకు వనపర్తి జిల్లాలోని మూడు మండలాల్లో కొందరికి మినహా మిగతా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించ లేదు. ప్రతీ నెల 15వ తేదీ నుంచి విడతల వారీగా అర్హులైన వారందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తొలి విడత పంపిణీయే ఇంకా పూర్తి కాలేదు. దాంతో మిగతా వారికి సాయం అందుతుందో లేదోననే సందేహాలు వ్యక్తమవు తున్నాయి.

నిధులు మంజూరయ్యాయి

తొలి విడతలో ఎంపికైన బీసీ కుల వృత్తి లబ్ధిదారుల కోసం నిధులు మంజూరు అయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని మదనాపురం, కొత్తకోట, దేవరకద్ర మండలాల్లో ఆర్థిక సాయం అందించారు. త్వరలోనే మిగతా లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు చెక్కులు అందజేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతీ నెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందుతుంది.

- సుబ్బారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి, వనపర్తి

Updated Date - 2023-08-04T23:34:16+05:30 IST