విస్తారంగా వానలు
ABN , First Publish Date - 2023-09-04T22:33:33+05:30 IST
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం రెండో రోజు కూడా వర్షాలు కురిశాయి. విస్తారంగా కురుస్తున్న వానలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల కింద వరిసాగు చేస్తున్న రైతులకు నీటి కరువు తీరినట్లైంది.
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులకు జలకళ
వరి చేలకు ఊపిరి..
పారుతున్న వాగులు.. వంకలు
జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో నీట మునిగిన వరి
జోరుగా మిరప, పొగాకు నాట్లు
మహబూబ్‌నగర్/గద్వాల/ఉండవల్లి/ఆత్మకూరు/నాగర్‌కర్నూల్ టౌన్/తాడూరు/నారాయణపేట టౌన్, సెప్టెంబరు 4: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం రెండో రోజు కూడా వర్షాలు కురిశాయి. విస్తారంగా కురుస్తున్న వానలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల కింద వరిసాగు చేస్తున్న రైతులకు నీటి కరువు తీరినట్లైంది. అయితే పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం సగటున 5.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవగా, సోమవారం మూడు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పలు మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలో రెండ్రోజుల్లో 20 సెంటీ మీటర్ల వాన కురవడంతో ఆ ప్రాంతంలో ఉన్న కుంటలు అలుగులు పారుతుండగా, చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. జిల్లాలోని దుందుభీ, పెద్దమ్మ వాగులు జోరుగా పారుతున్నాయి. ఆగస్టులో వానలు లేక ఎండిపోయే దశకు చేరుకున్న వరి చేనుకు ఈ వర్షాలు ఊపిరిపోశాయి. మిగతా పంటలకూ మేలు కలుగనుంది. మూసాపేటలో 2.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మహ్మదాబాద్‌లో 2.5, మహబూబ్‌నగర్ అర్బన్‌లో మూడు, బాలనగర్‌లో 2.6, మహబూబ్‌నగర్ రూరల్‌లో 3.4, రాజాపూర్‌లో 2.9, కౌకుంట్లలో రెండు, మిడ్జిల్‌లో 2.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
నీట మునిగిన వరి
వనపర్తి జిల్లాలో కూడా వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో 16 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో వీర రాఘవపూర్, తుంపల్లి గ్రామాలలో వరి పంట పొలాలు నీట మునిగాయని రైతులు తెలిపారు.
ప్రవహిస్తున్న దుందుభీ
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సగటున జిల్లా వ్యాప్తంగా 6.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అధికంగా అమ్రాబాద్ మండలంలో 51.6 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా తిమ్మాజిపేట మండలంలో ఒక మిల్లీ మీటరు వర్షం కురిసింది. పదర మండలంలో 17, పెంట్లవెల్లిలో 10.2, అచ్చంపేటలో 9.2, కొల్లాపూర్‌లో 8.6, తెల్క పల్లిలో 5.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 2.8 నుంచి 4.6 మిల్లీ మీటర్ల మధ్య వర్షం కురిసింది. ఊర్కొండ, చారకొండ, వంగూరు, కల్వకుర్తి, బల్మూరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో వర్ష ప్రభావం కనిపించలేదు. రెండు రోజులుగా కురు స్తున్న వర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లాలో దుందుభీ వాగు ప్రవహిస్తోంది. తాడూరు మండలం పాపగల్, సిర్సవాడ, అంతారం, మేడిపూర్ చెక్‌డ్యామ్‌లన్నీ నిండుకుంటూ వస్తోంది.
నారాయణపేటలో మోస్తరు వర్షం
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం మోస్తారు వర్షం కురిసింది. అత్యధికంగా గుండుమల్‌లో 8.8 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా కృష్ణా, మద్దూర్, కోస్గిలలో ఒక మిల్లీ మీటరు వర్షపా తం నమోదైంది. దామరగిద్దలో 1.2 మిల్లీ మీటరు, ఊట్కూర్‌లో 1.2, మక్తల్‌లో 3.2, నర్వలో 4.4, మరికల్‌లో 1.6, ధన్వాడలో 4.2, కొత్తపల్లిలో 1.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నారాయణపేట, మాగనూర్‌లో పడ లేదు.
పంట పొలాల్లోకి నీళ్లు
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లాలోని ఇటిక్యాల, ఉండవెల్లి, వడ్డేపల్లి, గద్వాలలో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గద్వాల, ఇటిక్యాల, వడ్డేపల్లిలలో లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. ఉండవెల్లి మండలంలో పొగాకు, మిరప నాట్లను జోరుగా వేశారు. ఇటిక్యాల మండలం కోదండాపురంలో అధికంగా 7.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి సమీపంలోని వాగు పొంగిపొర్లింది. ఇటిక్యాలలో 4.6 సెంటీ మీటర్లు, వడ్డేపల్లి 3.9, రాజోలిలలో 3.7, ఉండవెల్లిలో 3.2, గద్వాలలో మూడు, అయిజ, అలంపూర్‌లో 2.3, మానవపాడులో 1.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మల్దకల్, గట్టు, ధరూర్, కేటీదొడ్డి మండలాల్లో అతి తక్కువగా వర్షంపాతం నమోదైంది.