‘హాత్ సే హాత్’ జోడో యాత్రను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-03-02T23:36:06+05:30 IST
ఏఐసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హాత్ సే హాత్’ జోడో యాత్రను మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో కలిసి కట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, యాత్ర సమన్వయకర్త వేణుగౌడ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- సన్నాహాక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి
నారాయణపేట, మార్చి 2 : ఏఐసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హాత్ సే హాత్’ జోడో యాత్రను మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో కలిసి కట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, యాత్ర సమన్వయకర్త వేణుగౌడ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘హాత్ సే హాత్’ యాత్రపై మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని పట్టణ, మండల పార్టీ శ్రేణులతో సన్నాహాక సమావేశం నిర్వహించి అందరు కలిసి కట్టుగా పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రెండు నెలలు కొనసాగే ఈ యాత్రలో ఇంటింటికీ వెళ్లి గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి పార్టీ తరపున పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను వివరించాలని, త్వరలోనే నారాయణపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కుంభం శివ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేస్తామని, వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగుర వేస్తామన్నారు. అంతకుముందు టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిలిండర్లను ముందుంచి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ధరలను రూ.1150 పెంచి పేదల నడ్డీ విరుస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే సిలిండర్‌ను అందిస్తామన్నారు. సిలిండర్ ధరను తగ్గించకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా పేటలోని 23వ వార్డులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యూసూఫ్ తాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి ప్రారంభించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాగరాజ్, చంద్రశేఖర్, విషువర్ధన్, సూగప్ప, నర్సిములు, సుధాకర్, సదా శివారెడ్డి, బాల్‌రెడ్డి, గౌస్, విద్యాసాగర్, రాజప్ప, రవీందర్‌రెడ్డి, సలీం, రఘుబాబు, శరణప్ప, మహిమూద్ ఖురేషి, సాగర్, చెన్నయ్య పాల్గొన్నారు.