ఉత్పత్తి చేసే స్థాయికి నడిగడ్డ

ABN , First Publish Date - 2023-10-03T23:14:39+05:30 IST

నాడు పంటలు పండక వెనుకబడిన నడిగడ్డ ప్రాంతం నేడు సరుకులు ఉత్పత్తి చేసే స్థాయికి అభివృద్ధి చెందడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి దగ్గర ఉన్న విజయ వర్ధిని ఆయిల్‌ మిల్లును ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో పామాయిల్‌ కర్మాగారంగా మార్చేందుకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు.

ఉత్పత్తి చేసే స్థాయికి నడిగడ్డ
పామాయిల్‌ కర్మాగార నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

బీచుపల్లి వద్ద పామాయిల్‌ కర్మాగార పనులకు శంకుస్థాపన

ఎర్రవల్లి, అక్టోబరు 3: నాడు పంటలు పండక వెనుకబడిన నడిగడ్డ ప్రాంతం నేడు సరుకులు ఉత్పత్తి చేసే స్థాయికి అభివృద్ధి చెందడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి దగ్గర ఉన్న విజయ వర్ధిని ఆయిల్‌ మిల్లును ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో పామాయిల్‌ కర్మాగారంగా మార్చేందుకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాంతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్‌ మిల్లు నష్టాలపాలై 2003లో మూతపడిందన్నారు. నాటి సమైక్య పాలనలో నాయకులు విక్రయానికి పెడితే అప్పుడు అడ్డుకున్నది టీఆర్‌ఎస్‌ పార్టీనే అని గుర్తు చేశారు. నేడు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ఘనత కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రూ.200 కోట్లతో మిల్లు కర్మాగార పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులతో పూర్తిగా యాంత్రీకరణ చేస్తామన్నారు. ఈ మిల్లుతో 1,800 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. తాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా మిల్లుకు సంబంధించిన రూ.కోట్ల ఆస్తులను కాపాడేందుకు కృషి చేశానన్నారు. ఎన్‌డీడీబీలో ఉన్న రూ.35 కోట్ల బకాయిని ఈ ప్రాంత రైతాంగం కోసం సీఎం కేసీఆర్‌ చొరవతో రూ.తొమ్మిది కోట్లకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేశామన్నారు. ప్రస్తుతం గద్వాల జిల్లాలో 5,700 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోందన్నారు. ఇది లాభదాయకమైన పంట కావడంతో రైతులు దీనిపై దృష్టి సారించాలన్నారు. భారత దేశంలో ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ అగ్రగామిగా ఉందని, దీనిని కేంద్రం అభినందిస్తుందని చెప్పారు. పామాయిల్‌ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం రూ.54 వేల సబ్సిడీ అందిస్తున్నదన్నారు. రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ దృష్టి ఆహార రంగంపై ఉంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఉద్యానవన శాఖ కమిషనర్‌ సరోజిని, వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, హార్టికల్చర్‌ అధికారి అక్బర్‌, వనపర్తి జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-03T23:14:39+05:30 IST