వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2023-05-05T23:37:16+05:30 IST
ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభువు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
మల్దకల్/ అయిజ/ గద్వాల టౌన్, మే 5 : ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభువు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ప్రతీ నెల పౌర్ణమి రోజున నిర్వహించే కల్యాణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంకరించిన కల్యాణ మండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి అర్చకులు రమేషాచారి, రవిచారి నేతృత్వంలో కల్యాణం జరిపించారు. రాయిచూరుకు చెందిన పురుషోత్తంరావు, హైదరాబాద్‌కు చెందిన వీకే రఘురాం, శాంతినగర్‌కు చెందిన గడలే రాజ్ కుమారస్వామి కల్యాణోత్సవానికి సహకారం అందిం చారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవ దాతలను ఆలయ చైర్మన్ ఘనంగా సత్క రించి, జ్ఞాపికలను అందించారు.
ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో..
అయిజ మండల పరిధిలోని ఉత్తనూర్ గ్రామంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
జములమ్మకు పల్లకీ సేవ
నడిగడ్డ ఇలవేల్పు జమ్మిచేడ్ జములమ్మ వారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ నిర్వహించారు. ప్రతీ నెల పౌర్ణమి నాడు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకంతో పాటు సాయంకాలం పల్లకీ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖశుద్ధ పౌర్ణమి శుక్రవారం రావడంతో పల్లకీ సేవలో పాల్గొనేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సతీష్, డైరెక్టర్ జానకిరాములు, ఈవో పాల్గొన్నారు.