మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్‌గా గోపాల్‌

ABN , First Publish Date - 2023-07-21T23:36:06+05:30 IST

సాధారణ ఎన్నికలను తలపించిన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్‌ ఎన్నిక ఫలితాన్ని ఎట్టకేలకు శుక్రవారం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానో ప్రకటించారు.

మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్‌గా గోపాల్‌
నియామక పత్రం అందిస్తున్న జిల్లా మత్స్యశాఖ అధికారి

- నియామక పత్రం ఇచ్చిన గద్వాల జిల్లా మత్స్యశాఖ అధికారి

- జూన్‌ 23న ఎన్నికలు, ఎట్టకేలకు ఫలితం ప్రకటన

గద్వాల, జూలై 21 : సాధారణ ఎన్నికలను తలపించిన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్‌ ఎన్నిక ఫలితాన్ని ఎట్టకేలకు శుక్రవారం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానో ప్రకటించారు. చైర్మన్‌గా ఎంపికైన టి.గోపాల్‌కు నియామక పత్రం అందించారు. గత నెల 23న సంఘానికి ఎన్నికలు జరిగాయి. నాలుగు ప్యానళ్లు నామినేషన్‌ వేయగా, వాటిలో రెండు ప్యానళ్లు పోటీ నుంచి వైదొలిగాయి. గోపాల్‌ ప్యానల్‌, లక్ష్మన్న ప్యానల్‌ పోటీ పడ్డాయి. గోపాల్‌ ప్యానల్‌కు 32 సంఘాల అధ్యక్షులు మద్దతు పలికారు. కానీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ లక్ష్మన్న ప్యానల్‌ జిల్లా అధికారిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఫలితం ప్రకటించకుండా విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గోపాల్‌ ఎమ్మెల్సీ అనుచరుడు కావడంతో ఎన్నికను ప్రకటించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కానీ లక్ష్మన్న ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆయన అధికారులపై వత్తిడి తెచ్చారు. దీంతో ఎటూ తేల్చుకోలేని అధికారులు దాదాపు నెలరోజుల పాటు ఫలితాన్ని వెల్లడించలేదు. ఎట్టకేలకు చైర్మన్‌గా గోపాల్‌ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పది మంది డైరెక్టర్లను ఎంపిక చేశారు. వారిలో గుర్రంగడ్డ సంజీవులు, చెన్నయ్య, సుధాకర్‌, మద్దిలేటి గంగాధర్‌, తిమ్మప్ప, రాముడు, రంగన్న, లక్ష్మన్న, మద్దిలేటి, చిన్నరంగన్న ఉన్నారు. అనంతరం వారు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ వల్లూరు క్రాంతిని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్‌ గోపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన మత్స్యకారులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తనకు మద్దతు తెలిపిన మత్స్యకార సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-07-21T23:36:06+05:30 IST