తొలకరి పలకరింపు
ABN , First Publish Date - 2023-06-07T23:33:47+05:30 IST
జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం మోస్తరు వర్షం కురియ డంతో వానాకాలం సాగుకు ఇది వరకే దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి పలకరింపుతో వానాకాలం సాగుకు శ్రీకారం చుట్టారు.
నారాయణపేట, జూన్ 7 : జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం మోస్తరు వర్షం కురియ డంతో వానాకాలం సాగుకు ఇది వరకే దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి పలకరింపుతో వానాకాలం సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బుధవారం రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మృగశిర కార్తికి ముందే తొలకరితో ఉత్సాహంలో ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా నారాయణపేట మండలంలో 43.8 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, నర్వలో అత్యల్పంగా 2.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దామరగిద్దలో 12 మిల్లీ మీటర్లు, ఊట్కూర్‌లో 36.2 మిల్లీ మీటర్లు, మక్తల్‌లో 6.2 మిల్లీ మీటర్లు, మరికల్‌లో 3.6 మిల్లీ మీటర్లు, ధన్వాడలో 15.04 మిల్లీ మీటర్లు, మద్దూర్‌లో 24.04 మిల్లీ మీటర్లు, కొత్తపల్లిలో 9.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈదురు గాలులతో మోస్తరు వర్షం
జిల్లా కేంద్రంలో మూడు గంటల పాటు విద్యుత్ కోత
జిల్లా కేంద్రమైన నారాయణపేటలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు విద్యుత్ అంత రాయం ఏర్పడింది. పళ్ల ప్రాంతంలో చెట్టు కూలి పోవడంతో విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. 7.30 గంటలకు కరెంటు వచ్చినా, పాత బస్టాండ్ ఏరియాతో పాటు చిన్న పిల్లల ఆసుపత్రికి 7.50 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో చిన్న పిల్లల ఆసుపత్రిలో విద్యుత్ లేక పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తేలికపాటి ఈదురు గాలులు వర్షానికే రెండురోజులుగా గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడితే రాబోయే వర్షాకాలంలో భారీ వర్షాలకు ఏ మేరకు విద్యు త్ సరఫరా అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ట్రాన్స్‌కో తీరుపై పట్టణ ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.