వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా

ABN , First Publish Date - 2023-09-21T23:48:12+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్టోబరు 4న ఓటరు తుది జాబితా ప్రచురించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా
ఆర్డీవో కార్యాలయంలో అఖిలపక్షం నాయకులతో సమీక్షిస్తున్న ఆర్డీవో రాంచందర్‌

- మూడు సెగ్మెంట్లలో 6,69,727 మంది ఓటర్లు

నారాయణపేట, సెప్టెంబరు 21 : రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్టోబరు 4న ఓటరు తుది జాబితా ప్రచురించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఓటరు జాబితా సవరణ, ఫిర్యాదుల పరిష్కారం, కొత్త ఓటర్ల నమోదుపై ఫాం 6, 7, 8లపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతో పాటు పరిష్కరిస్తూ తుది జాబితా రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ బుధవారం నియోజకవర్గ స్థాయిలో అధికారులు, అఖిల పక్షం నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఓటరు జాబితా రూప కల్పనపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా అదనపు ఎన్నికల అధికారులు, ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను నియమించి ఎన్నికల ప్రక్రియపై నిత్యం సమీక్షా సమావేశాలతో దశా దిశా నిర్దేశం చేస్తూ తుది ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో ఈవీఎంల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని కొడంగల్‌, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో 6,69,727 మంది ఓటర్లు ఉన్నారు. 2023 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం పేట నియోజకవర్గంలో కోయిల్‌కొండ, మరికల్‌, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట మండలాలు కలిపి 270 పోలింగ్‌ కేంద్రాలకు గాను 2,19,795 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,09,304 మంది, మహిళలు 1,10,491 మంది ఉన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో ఆత్మకూర్‌, అమరచింత, మక్తల్‌, నర్వ, మాగనూర్‌, కృష్ణ, ఊట్కూర్‌ మండలాలు కలిపి 280 పోలింగ్‌ కేంద్రాలకు మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,13,917 మంది, మహిళలు 1,16,599 మంది ఉన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో 275 పోలింగ్‌ కేంద్రాలకు 2,19,417 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,09,163 మంది, మహిళలు 1,10,239 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు.

Updated Date - 2023-09-21T23:48:12+05:30 IST