ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-03-12T23:23:39+05:30 IST

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వ సిద్ధం చేశారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
మహబూబ్‌నగర్‌లో బ్యాలెట్‌ బాక్సులు తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది

ఉపాధ్యాయ శాసన మండలి ఎలక్షన్స్‌ కోసం ఏర్పాట్లు పూర్తి

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,331 ఓట్లు

పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం

ఓట్లర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 12: మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వ సిద్ధం చేశారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో మొత్తం 29,732 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8,331 ఓట్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3,567 ఓట్లు ఉండగా, నాగర్‌కర్నూల్‌లో 1,804, వనపర్తిలో 1,399, నారాయణపేటలో 688, జోగులాంబ గద్వాల జిల్లాలో 873 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే అధిక ఓటర్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8,331 ఓట్లు ఉంటే, మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా 3,567 ఓట్లు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో ఓట్లు సాధించేందకు మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి 15 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఎన్నికలు జరుగనున్నందున ఎన్నికల సిబ్బంది ఆదివారమే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు.

గురువులు డబ్బులు తీసుకోవడంపై విమర్శలు

ఎన్నికల్లో ఓటర్లకు ఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా డబ్బులు పంపిణీ చేశారని కొందరు ఉపాధ్యాయలు ఆరోపించారు. సమాజానికి మార్గనిర్దేశకులని చెప్పే గురువులే ఓటు కోసం డ బ్బులు తీసుకుంటున్నారనే ఆరోప ణలు కలకలం రేపుతున్నాయి. ఓటును రూ.4,000లకు అమ్ముకో వడం సమాజం తలదిం చుకునేలా ఉందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యం వహించొద్దు

మహబూబ్‌నగర్‌ టౌన్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగొద్దని, నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తప్పవని కలెక్టర్‌ జి.రవినాయక్‌ హెచ్చరించారు. ఎన్నికల విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పోలింగ్‌ నిర్వహణకు నియమించిన ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా అన్ని అంశాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ సకాలంలో ప్రారంభించాలన్నారు. పోలింగ్‌ నిర్వహణలో ఆయా కేంద్రాలకు నియమించబడిన మొత్తం బృందం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై ఇదివరకే శిక్షణ ఇవ్వడమే కాకుండా హ్యాండ్‌ బుక్‌ ఇచ్చామన్నారు. పోలింగ్‌ ముగిశాక బాక్స్‌లను సీల్‌ చేసి, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రంలో అప్పగించాలని ఆదేశించారు. రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, అదనపు ఎస్పీ రాములు ఎన్నికల కోసం తీసుకుంటున్న చర్యలు, బందుబస్తు గురించి వివరించారు. సమావేశంలో డీఎస్పీ మహేష్‌, ఎన్నికల నోడల్‌ అధికారులు తహసీల్దార్లు, పీవో, ఏపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-12T23:23:39+05:30 IST