మండలంగా ఎర్రవల్లి
ABN , First Publish Date - 2023-04-18T23:42:33+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి చేరాయని కార్యాలయ అధికారులు ధ్రువీకరించారు.
గెజిట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం
జోగుళాంబ గద్వాల జిల్లాలో 13కి చేరిన మండలాల సంఖ్య
ఫలించిన పాదయాత్రలు, నిరాహార దీక్షలు
గద్వాల, ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 18: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి చేరాయని కార్యాలయ అధికారులు ధ్రువీకరించారు. దాంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవల్లిని మండలంగా ప్రకటించాలని గత కొంత కాలంగా ఇటిక్యాల మండలంలోని పలు గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతూ వచ్చారు. ఇటిక్యాల మండల కేంద్రం కొన్ని గ్రామాలకు దూరంగా ఉండటం, రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో మండల కేంద్రానికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఎర్రవల్లి చౌరస్తా అన్ని గ్రామాలకు రవాణా పరంగా, వసతుల పరంగా అనుకూలంగా ఉండటంతో పాటు మండలం ఏర్పాటుకు అనువుగా ఉందని, మండలంగా ప్రకటిం చాలని ప్రజలు చాలాకాలంగా డిమాం డ్ చేస్తూ వచ్చారు. గత ఏడాది నుంచి ఈ డిమాండ్ మరింత పెరిగి, నిరవధిక నిరా హార దీక్షలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు పాదయా త్రను నిర్వహించారు. ప్రజల డిమాం డ్‌ను దృష్టిలో పెట్టుకొని ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎర్రవల్లిని మండలంగా చేయి స్తానని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం హామీ ఇచ్చారు. విష యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మండలంగా ప్రకటింపజేశారు.
10 గ్రామ పంచాయతీలతో మండలం
అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిని 10 గ్రామ పంచాయతీలతో కలిపి మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. ఇటిక్యాల మండ లంలోని 10 గ్రామ పంచాయతీలను ఎర్రవల్లిలోకి చేర్చి, కొత్త మండలాన్ని చేయనుంది. కొత్త మండలంలో ఎర్రవల్లి, తిమ్మాపూర్, సాసనూల్, బొచ్చు వీరాపురం, రాజశ్రీ గార్లపాడు, కారుపాకుల, ధర్మవరం, పుటాన్‌దొడ్డి, కొండేరు, వేముల గ్రామ పంచాయతీలు ఉండనున్నాయి. 15 రోజుల్లో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పంపించాలని కలెక్టర్‌ను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. ఎర్రవల్లి కొత్త మండలంగా ఏర్పాటు అవుతుండటంతో జిల్లాలోని మండలాల సంఖ్య 12 నుంచి 13కు పెరుగనుంది. అలంపూర్ నియోజక వర్గంలో మండలాల సంఖ్య ప్రస్తుతం ఏడు ఉండగా, ఎనిమిదికి చేరనుంది.