సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు
ABN , First Publish Date - 2023-02-07T00:00:25+05:30 IST
గ్రామ పంచాయతీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్‌గా శాశ్వత పనులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

- 182 పనులకు రూ.10 కోట్లు మంజూరు
- పనులు చేయడానికి జంకుతున్న నాయకులు
- గత ఏడాది పనుల బిల్లులు రాక తిప్పలు
గద్వాల రూరల్, ఫిబ్రవరి 6 : గ్రామ పంచాయతీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఆ నిధుల్లో 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్‌గా శాశ్వత పనులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. మిగతా 60 శాతం కూలీలకు వేతనాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. గత ఏడాది ఈ నిధులు భారీగా మంజూరు కాగా, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి వినియోగించారు. ఈ ఏడాది కూడా గ్రామాల్లో సీసీ రోడ్ల అభివృద్ధికి జిల్లాకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వారు అంచనాలను కూడా సిద్ధం చేశారు.
నియోజకవర్గానికి రూ. 5 కోట్లు
ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యా యి. అందులో గద్వాల నియోజకవర్గంలో 82 పనులకు ఐదు కోట్ల రూపాయలు, అలంపూర్ నియోజకవర్గంలో 100 పనులకు ఐదు కోట్లు రూపాయలు కేటాయించారు. వీటిని మండలాలు, గ్రామా ల వారీగా పంపిణీ చేశారు. ఈ పనులను రెండు నెలల్లో అంటే మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే నిధులు వాపసు పోయే అవకాశం ఉంది. గత ఏడాది రూ.24 కోట్లు మంజూ రు కాగా, ఈ ఏడాది రూ.10 కోట్లు మాత్రమే వచ్చాయి. రెండవ విడుత నిధులు మంజూరవు తాయనే సమాచారం ఉంది.
రూ.12 కోట్ల బిల్లులు పెండింగ్
ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరైనా, సీసీ రోడ్లు నిర్మించడానికి ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు. గత ఏడాది జిల్లాకు రూ.24 కోట్లు మంజూరు కాగా, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వెంటబడి పనులు చేయించారు. సర్పంచులు కూడా గ్రామాభివృద్ధి కోసం తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి పనులు పూర్తి చేశారు. అయితే గత ఏడాది ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసినా, సర్పంచుల ఖాతాల్లో జమ చేసినది రూ.12 కోట్లు మాత్రమే. ఇంకా రూ.12 కోట్ల బిల్లులు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో అప్పులు చేసిన పనులు చేపట్టిన ప్రజాప్రతినిధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధి సీసీ రోడ్లను నిర్మించడానికి ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఎంత మంది వీటిని నిర్మించడానికి ముందుకొస్తారో వేచి చూడాల్సి ఉంది.