కరెంటు కష్టాలు

ABN , First Publish Date - 2023-05-31T23:06:23+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌కు ముందు (ముంగారు కాలం) వీస్తున్న గాలులు, కురుస్తున్న అకాల వర్షాలకు విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోతున్నాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్తున్నాయి.

కరెంటు కష్టాలు
అలంపూర్‌-అయిజ ప్రధాన రహదారిపై ఒరిగిన విద్యుత్‌ స్తంభం (ఫైల్‌)

- గాలి వానలకు ఒరుగుతున్న విద్యుత్‌ స్తంభాలు, తెగి పడుతున్న తీగలు

- గంటల తరబడి సరఫరాకు అంతరాయం

- పనుల నాణ్యతపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

గద్వాల అర్బన్‌, మే 31 : ఖరీఫ్‌ సీజన్‌కు ముందు (ముంగారు కాలం) వీస్తున్న గాలులు, కురుస్తున్న అకాల వర్షాలకు విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోతున్నాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్తున్నాయి. దీంతో ప్రజలు, ప్రధా నంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురిసినప్పుడు విద్యుత్‌ తీగలు తెగిపడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరి కొన్ని చోట్ల త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ లైన్ల పరిధిలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త లైన్ల ఏర్పాటు సమయంలో అధికారుల పర్యవేక్షణ లేక పనుల్లో నాణ్యత లోపించిందన్న ఆరోపణలున్నాయి. పనులను కాంట్రాక్టు తీసుకున్న వారు తూతూమం త్రంగా పనులు చేసినా, పట్టించుకోని అధికారులు బిల్లుల మంజూరుపై మాత్రం వేగంగా నిర్ణయం తీసు కోవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన లైన్లు ఇప్పటికీ సమర్థ వంతంగా పనిచేస్తుండగా, ఏడాది క్రితం ఏర్పాటు చేసి న విద్యుత్‌ లైన్లలో తరుచూ సమస్యలు తలెత్తుతుం డడంపై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనలు బేఖాతరు

విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చే సమయంలో నిబంధనలు పాటించకపోవడం సమస్యగా మారింది. గుడిసెలు, రేకుల షెడ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కనెక్షన్‌ ఇవ్వాలని విద్యుత్‌ శాఖ నిబంధనలున్నాయి. కానీ నిబంధనల ఉల్లంఘన యథేత్సగా కొనసాగు తోంది. ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామ సమీపం లో రేకులషెడ్డుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. షెడ్డులోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉన్న విద్యుత్‌ తీగ ఊడిపోయి రేకులకు తగలడంతో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి ఐదేళ్ల బాలిక తిమ్ములమ్మ(షాలిని) మృత్యువాత పడింది. బాలికను కాపాడేందుకు యత్నించిన అమ్మమ్మ సంతో షమ్మ కూడా విద్యుదాఘాతంతో అస్వస్థతకు గురయ్యిం ది. ఆమెకు వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపా యం తప్పింది. ఇటీవల కేటీదొడ్డి సమీపంలోని పొలాల్లో కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి రైతు కురువ సతీశ్‌కు చెందిన నాలుగు గేదెలు, ఒక ఆవు చనిపోయాయి. ఆ సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

వానాకాలంలో పరిస్థితి ఏంటి?

వేసవిలో కురిసిన ఆకాల వర్షం, ఓ మోస్తరు ఈదురు గాలులకే పరిస్థితి ఇలా ఉంటే, వచ్చే వర్షా కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని విద్యుత్‌ వినియోగదారులు, రైతులు, ప్రజలు ఆందోళన చెందు తున్నారు. జూలై రెండో వారం నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానున్నది. ఆ సమయంలో బలమైన గాలు లు వీస్తాయని, అప్పుడు విద్యుత్‌ స్తంభాలు, తీగల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ఆందో ళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే, జిల్లా కేంద్రంలో విద్యుత్‌ సరఫరాకు తరుచూ ఏర్పడుతున్న అంతరాయం సమస్యగా మారింది. ఏ వీధిలో విద్యుత్‌ సరఫరా ఎప్పుడు నిలిచి పోతుందో? ఎందుకు సరఫరా నిలిచిపోయిందో? అర్థం కాక చిరు వ్యాపారులు, ఖార్గానాల యజమానులు, కార్మికులు తలపట్టుకుంటున్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ కార్యాలయానికి ఫోన్‌ చేస్తే సరైన స్పందన ఉండటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది కానీ, అధికారులు కానీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని, ఒక వేళ లిఫ్ట్‌ చేసినా సరిగా సమాధానం ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు స్పందించి, వర్షాకాలంలో వినియోగదారులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-05-31T23:06:23+05:30 IST