ఎండుతున్న పంటలు

ABN , First Publish Date - 2023-08-25T00:16:36+05:30 IST

ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురియకపోవడంతో వానాకాలం సీజన్‌ ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఆలస్యంగా ప్రారంభమైంది. జూలైలో వర్షాలు సమృద్ధిగా కురియడంతో రైతులు పంటల సాగుకు చేశారు.

ఎండుతున్న పంటలు
హన్వాడ మండలంలోఎండిన మొక్కజొన్న పంట

వడ్డేపల్లి/మాగనూరు/హన్వాడ/చిన్నచింతకుంట, ఆగస్టు 24 : ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురియకపోవడంతో వానాకాలం సీజన్‌ ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఆలస్యంగా ప్రారంభమైంది. జూలైలో వర్షాలు సమృద్ధిగా కురియడంతో రైతులు పంటల సాగుకు చేశారు. ఆగస్టు నెలలో పంటలు ఎదిగే సమయంలో వర్షాలు కురి యకపోడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఒకవైపు వర్షంపై ఆధార పడిన పంటలు, మరోవైపు బోరుబావులు, కెనాల్‌ కింద సాగవుతున్న పంటలు ఎదుగులదలేక ఎండు ముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి, శాంతినగర్‌ మండలాల్లో సాగు చేసిన పంటలు వర్షం లేక ఎండుముఖం పట్టాయి. ఎంతో కొంత బోర్లు, బావుల నీటి సౌకర్యంతో వేసిన పంటలు కూడా తెగుళ్లబారిన పడ్డాయి. పక్కనే ఉన్న జూరాల కెనాల్‌కు నీళ్లు విడుదల చేసి ఆర్డీఎస్‌కు విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో వర్షాధార పంటలైన పత్తి, కంది, వేరుశనగ, ఆముదం పంటలు వేల ఎకరాల్లో సాగు చేశారు. నెల రోజులుగా వర్షం లేని కారణంగా పంటలు పూర్తిగా వాడుపట్టాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాధార పంటలు పూర్తిగా ఎండుమొఖం పట్టాయి. హన్వాడ మండలంలో దాదాపు 11 వేల ఎకరాలలో పంట సాగుచేశారు. అందులో దాదాపు 8,500 ఎకరాలలో వరి, 700 ఎకరాలలో మొక్కజొన్న, 2,000 ఎకరాలలో ఇతర పంటలు సాగుచేశారు. నెల రోజులుగా వర్షం కురియకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.

బోరుబావుల కింద సాగుచేసిన పంటలు కూడా నీరందక ఎండుతున్నా యి. హన్వాడ మండలంలో భూగర్భజలాలు తగ్గడంతో పాటు విద్యుత్‌ కోతలతో వరి మడులు నెర్రెలు పారుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేస్తున్నట్లు విద్యుత్‌ అధికారుల ద్వారా తెలిసింది. మిగతా సమయం సింగిల్‌ ఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చిన్నచింతకుంట మండలంలోని ఏదులాపూర్‌, దాసర్‌పల్లి, అప్పంపల్లి, ఉంద్యాల, వడ్డెమాన్‌, లాల్‌కోట, నెల్లికొండి తదితర గ్రామాల్లో రైతులు మిరప సాగుచేశారు. వర్షాలు లేక మిరపతోట ఎండుతుండటంతో కొందరు ఇతరుల బోరుబావుల నుంచి నీటి పారించుకుంటున్నారు.

Updated Date - 2023-08-25T00:16:36+05:30 IST