దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
ABN , First Publish Date - 2023-07-21T00:19:28+05:30 IST
జీవో 58, 59 ద్వారా వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్వేయర్లను ఆదేశించారు.
- సర్వేను త్వరగా పూర్తి చేయాలి
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
నారాయణపేట టౌన్, జూలై 20 : జీవో 58, 59 ద్వారా వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్వేయర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సర్వే అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 70 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వివిధ మండలాలకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా సర్వే చేసిన నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు నోడల్ అధికారుల శిక్షణ సమావేశం కొనసాగగా, ఎన్నికల నిబంధనల మేరకు నోడల్ అధికారులు పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ, స్వీప్ లా అండ్ ఆర్డర్, ఈవీఎం మేనేజ్‌మెంట్, బ్యాలెట్ బాక్స్, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో నోడల్ అధికారులు గోపాల్, జ్యోతి, కృష్ణమాచారి, వీరస్వామి, హుస్సెన్, హథిరామ్, గోవిందరాజన్, యాదగిరి, మురళి, వేణుగోపాల్, కన్యాకుమారి, జగదీశ్వర్, డీటీ రాణి, రషీద్, మహమూద్ పాల్గొన్నారు.
చక్కగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి
ప్రభుత్వం కల్పించే సదుపాయాలతో విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష కోరారు. నారాయణపేట శాతవాహన కాలనీలోని సంక్షేమ వసతి గృహాన్ని గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగది, డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని, సబ్జెక్టుల వారిగా విద్యార్థులు చదువుకునేందుకు చర్యలు తీసుకోవాలని వార్డెన్‌ను ఆదేశించారు. బీసీ సంక్షేమ అధికారి, హాస్టల్ సిబ్బంది ఉన్నారు.