‘మన ఊరు - మన బడి’తో పాఠశాలల అభివృద్ధి
ABN , First Publish Date - 2023-01-04T23:18:09+05:30 IST
మన ఊరు - మన బడి కార్యక్రమంతో పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాకుళారం గ్రామంలో రూ.10 లక్షల వ్యయం తో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- కాకుళారంలో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన
గద్వాల రూరల్, జనవరి 4 : మన ఊరు - మన బడి కార్యక్రమంతో పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాకుళారం గ్రామంలో రూ.10 లక్షల వ్యయం తో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాఠశాలలో మౌలిక వసతులను కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పాఠశాలకు ప్రహరీ లేదని సర్పంచు పావని నర్సింహులు తన దృష్టికి తేవడంతో నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచు పావని నర్సింహులు, ఎంపీపీ అల్వాల్ ప్రతాప్ గౌడ్, విజయ్‌కుమార్, కుర్వపల్లి సర్పం చు వాసుదేవుడు, బీఆర్‌ఎస్ నాయకులు రమేష్ నాయు డు, నర్సింహులు, రాంచందర్, జయన్న, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకటన్న పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి కావాలి
అష్టాదశ శక్తి పీఠాల పనులను జములమ్మ బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ఆదేశించారు. జములమ్మ ఆలయం వద్ద రోడ్డు వెంట నిర్మిస్తున్న అష్టాదశ శక్తి పీఠాల ఏర్పాటు పనులను బుధవారం వారు పరిశీలించారు. గోపురాల పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో 10 రోజుల్లో పూర్తి చేస్తామని చైర్మన్ కుర్వ సతీష్‌కుమార్ ఎమ్మెల్యేకు వివరించారు. బ్రహ్మోత్సవాల నాటికి విగ్రహాల ప్రతిష్ఠ కూడా పూర్తవుతుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పా ట్లు కూడా ఘనంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వారి వెంట రైతు బంధు చైర్మన్ చెన్నయ్య, ఎంపీపీ విజయ్, డైరెక్టర్ అభిలాష్ తదితరులు ఉన్నారు.
పనులు వేగవంతం చేయాలి
గద్వాల క్రైం : కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వేగవంతమయ్యేలా చూడాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి అన్ని మండలాలలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల పనులపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల పెళ్లిళ్లు, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానా నిర్మాణాలకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. స్థలం లేకపోవడంతో కొన్ని గ్రామాలలో పనులు ప్రారంభం కాలేదని, సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో స్ధలాలను ఎంపిక చేసి త్వరగా పనులు చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీలు ప్రతాప్‌గౌడు, విజయ్, రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సరస్వతికి రూ.60,000, అబ్దుల్ రజాక్‌కు రూ. 60,000, నరేష్‌కు రూ.22,000 విలువైన చెక్కులను అందించారు. మల్దకల్ మండల పరిధిలోని శేషంపల్లికి చెందిన సుదర్శన్‌రెడ్డికి రూ. 18,000, కేటీదొడ్డి మండలానికి చెందిన తాయప్పకు రూ. 14,000 విలువైన చెక్కులను ఇచ్చారు. మల్దకల్‌కు చెందిన సురేఖకు రూ. 24,000, శంకరమ్మకు రూ. 12,000, నాగమ్మకు 12,000 విలువైన చెక్కులను అందించారు.
టీఎన్‌జీవో క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం టీఎన్‌జీవో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి డాక్టర్ కిశోర్‌కుమార్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సంగీత పుష్ప గుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్ టి.శ్రీనివాసులు ఉన్నారు.