అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-09-21T23:28:01+05:30 IST

దళితబంధు పథకాన్ని అర్హులైన పేదలకు ఇవ్వాలని మండలంలోని పారుపల్లి దళితులు డిమాండ్‌ చేశారు.

అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలి
గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలుపుతున్న దళితులు

- బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇచ్చారని పారుపల్లిలో దళితుల నిరసన

కోయిలకొండ, సెప్టెంబరు 21 : దళితబంధు పథకాన్ని అర్హులైన పేదలకు ఇవ్వాలని మండలంలోని పారుపల్లి దళితులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు కాస్త బీఆర్‌ఎస్‌ బంధుగా మారిందని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం గ్రామ పంచాయతీ కార్యాయం ముందు నిరసనకు దిగారు. పదవులున్న వారికి, ఆర్థికంగా ఉన్న వారికి పథకాలు వర్తింపజేస్తే బీద ప్రజల పరిస్థితి ఏంటని నాయకులను ప్రశ్నించారు. అందుకే తమ గ్రామానికి ఈ పథకం వద్దని తీర్మానం చేశారు. గ్రామంలో 30మంది దరఖాస్తు చేసుకుంటే 15 మందికి వచ్చాయని, అర్హులం దరికీ ఇవ్వాలని కోరారు. న్యాయంగా అర్హులకు ఇస్తే అందరు సంతోషిస్తారని, లేకుంటే కులంలో చిచ్చు రేపినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కమీషన్లకు ఆశపడి గ్రామంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు వారికి నచ్చిన వారి పేర్లను అధికారులకు పంపారని ఆరోపించారు. నీతి నిజాయితీగా లబ్ధిదారు లను ఎంపిక చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దళితులు హరీష్‌, వీరన్న, ఆంజనేయులు, రాజు, బాలకిష్టప్ప, రాములు, దాసు, రాజేందర్‌, చెన్నమ్మ, లక్ష్మమ్మ, ఆశమ్మ, లింగమ్మ, నాగమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:28:01+05:30 IST