పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
ABN , First Publish Date - 2023-08-22T23:41:58+05:30 IST
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ సృజన అన్నారు. తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.
- ‘హరితహారం’లో ఎస్పీ సృజన
గద్వాల క్రైం, ఆగస్టు 22 : పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ సృజన అన్నారు. తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుందని చెప్పారు. దీంతో అక్కడ ఉండే వారి ఆలోచన విధానం మారుతుందన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నా, ప్రాణవాయువైన ఆక్సిజన్ శాతం పెరగాలన్నా మొక్కలు నాటి పెంచాల్సిందేనన్నారు. ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్సీ ఎన్.రవి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్, ఏఓవో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.