Share News

కాంగ్రెస్‌ది ప్రజా పాలన

ABN , First Publish Date - 2023-11-27T22:58:16+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ప్రజా పాలన, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది కుటుంబం, ఫామ్‌హౌజ్‌ల పాలన అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మేళ చెరువు చౌరస్తాలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్‌ది ప్రజా పాలన
సభలో ప్రసంగిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ;

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

గద్వాల, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ప్రజా పాలన, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది కుటుంబం, ఫామ్‌హౌజ్‌ల పాలన అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మేళ చెరువు చౌరస్తాలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆమె మాట్లాడారు. ఒకప్పుడు ఏం ఆస్తిపాస్తులు లేనివారికి.. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ల్యాండ్‌, శాండ్‌, కల్లు, మైనింగ్‌ మాఫియాతోపాటు ప్రాజెక్టులు, ఇతర పనుల్లో నాణ్యత లేకుండా చేసి.. కమీషన్ల రూపంలో లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థుల బలిదానాలు, ప్రజల త్యాగాలు చూడలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలం గాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వారు ఏ ఆకాంక్షలతో రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకున్నారో పదేళ్లలో ఆ స్వప్నం సాకారం కాలేదన్నారు. ప్రజల కష్టాల్లో ప్రభు త్వం పాలుపం చుకోలేదని అన్నారు. రాష్ట్రంలో చాలామంది ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మహిళలకు చేయూత లేదని, రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం లేదని, విద్యార్థులకు సరైన విద్యా, ఉద్యోగాల కల్పన జరగడం లేదని విమర్శించారు. సీఎం ప్రజలను కలవకుండా ఉంటే వారి కష్టాలు ఎలా తెలుస్తాయని, ఫామ్‌హౌజ్‌లో పడుకుంటే పేదలు ఎలా గుర్తుకు వస్తారని ప్రశ్నించారు. ధరణితో పేదల భూములను కాజేసిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల భూములను వారికి అప్పగిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడంతో వందల కోట్ల రూపాయలకు పడగలెత్తారని ఆరోపించారు. అప్పులు, నిత్యావసరాల ధర లు, నిరుద్యోగంతో తెలంగాణ ప్రజలు విలవిల్లాడుతు న్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ఐదేళ్లలో ఏ పని చేయకుండా అబద్ధపు ప్రచారాలను నమ్ముకున్నారు. కొందరు జాతి, మరికొందరు మాతాన్ని నమ్ముకుని.. అధికారం కోల్పోకుండా ఎత్తుగడలు వేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 6 లక్షలు, మహిళలకు నెలకు రూ.2500 చొప్పున, వరికి మద్దతు ధరపై రూ.500 బోనస్‌, రూ.10 లక్షల ఆరోగ్య భరోసా, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతీ జిల్లాలో ఇంటర్నేషనల్‌ పాఠశాల, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామన్నారు. ఎస్టీల కు ప్రభుత్వ సహకారం, అంబేడ్కర్‌ అభయహస్తం కింద రూ.12 లక్షల సాయం, ఎస్టీల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. ఏడాదికి రూ.4 వేల కోట్ల బడ్జెట్‌, సంత్‌ సేవాలాల్‌ భవన నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఆర్థిక సాయం చేస్తామని, గద్వాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మల్లు రవి, తీన్మార్‌ మల్లన్న, బండ్ల చంద్ర శేఖర్‌రెడ్డి, గంజిపేట శంకర్‌, మధుసూదన్‌బాబు, రామలింగేశ్వర కాంబ్లే, టీఎన్‌ఆర్‌ జగదీష్‌, డీటీడీసీ నర్సింహ, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ నాయకులు ఆంజనేయులు, గంజిపేట రాములు, ఆలూరు ప్రకాశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

సభ సక్సెస్‌..

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల విజయభేరి సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలొచ్చారు. ప్రియాంకగాంధీ పలు పథకాలను వివరించే సమయంలో కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రియాంక ప్రసంగాన్ని అభ్యర్థి సరిత తెలుగులో అనువదించారు.

బహుజన బిడ్డను ఓడించేందుకు కుట్ర: సరిత

గద్వాలలో మొదటిసారి బహుజన ఆడబిడ్డకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే.. తనను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అభ్యర్థి సరిత అన్నారు. తన పేరుతోనే ఉన్న మరో ఇద్దరితో నామినేషన్లు వేయించడం కూడా ఇందులో భాగమేనని అన్నారు. ప్రచారం చేస్తుంటే కొందరు రౌడీ మూకలుగా తయారయ్యి.. గొడవలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా గద్వాలలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. గద్వాలలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తామని, ఆరు నెలల్లో గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మిస్తామని అన్నారు.

Updated Date - 2023-11-27T22:58:37+05:30 IST