రాజకీయాల్లోకి చిట్టెం పర్ణికారెడ్డి

ABN , First Publish Date - 2023-06-02T23:25:17+05:30 IST

క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి మరో వారసురాలు సిద్ధమయ్యారు. మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి త్వరలో తాను నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు.

రాజకీయాల్లోకి చిట్టెం పర్ణికారెడ్డి
పర్ణికారెడ్డి

దివంగత చిట్టెం నర్సిరెడ్డి మనవరాలి ఎంట్రీపై ఆసక్తి

వెంకటేశ్వరరెడ్డి తనయ కావడంతో సర్వత్రా చర్చనీయాంశం

నారాయణపేట నియోజకవర్గ ప్రచార బాధ్యతలు స్వీకరిస్తానంటూ ప్రకటన

కాంగ్రెస్‌ అధిష్ఠానం అవకాశమిస్తే ఎమ్మెల్యేగానూ పోటీ చేసే ఛాన్స్‌

మహబూబ్‌నగర్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి మరో వారసురాలు సిద్ధమయ్యారు. మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి త్వరలో తాను నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నారాయణపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సోదరుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి, మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ కార్యాచరణపై ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు దివంగత చిట్టెం వెంకటేశ్వరరెడ్డి తనయ కావడంతో ఈమె ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుకోసం తనవంతుగా కృషి చేస్తానని, గ్రామగ్రామానికి తిరుగుతానని ఆమె ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

చిట్టెం వారసురాలిగా జనంలోకి వెళ్లే వ్యూహం

చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు డాక్టర్‌ పర్ణికారెడ్డి పొలిటికల్‌ ఎంట్రీ స్టేట్‌మెంట్‌ వెనక కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. 2005 నక్సలైట్ల కాల్పుల్లో అప్పటి మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయుడు, అప్పటి యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మరణించారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో నర్సిరెడ్డి పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజకీయ అవకాశమివ్వగా, రాష్ట్ర ప్రభుత్వం చిట్టెం వెంకటేశ్వరరెడ్డి సతీమణి లక్ష్మికి ఆర్డీవోగా ఉద్యోగం కల్పిం చింది. అప్పటి నుంచి మక్తల్‌ నియోజ కవర్గ కేంద్రంగానే రామ్మోహ న్‌రెడ్డి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నారాయణపేట నియోజకవర్గం ఏర్పాటయి నప్పటికీ, రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌ నియోజక వర్గాన్నే రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు. 2009లోనూ అక్కడి నుంచే పోటీ చేశారు. ఇదే సమయంలో సమాం తరంగా వెంకటేశ్వరరెడ్డి బావమరిది కుంభం శివకుమార్‌రెడ్డి నారాయణపేట నియోజకవర్గాన్ని ఎంచుకొని బావ వెంకటేశ్వరరెడ్డి పేరున విద్య, వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దివంగత ఇద్దరు నాయకుల వర్ధంతులు, జయంతులతో పాటు ఇతర దినోత్సవాలు, పాఠశాలల వార్షికోత్సవాలు, ప్రారంభోత్సవాల్లో పుస్తకాల పంపిణీ, వైద్యం కోసం సహాయాలు, క్రీడా పోటీలకు స్పాన్పర్స్‌గా వ్యవహరిస్తూ వెంకటేశ్వరరెడ్డి అనుచరవర్గాన్ని శివకుమార్‌ రెడ్డి కొనసాగిస్తూ వస్తున్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శివకుమార్‌రెడ్డి, ఇక్కడ ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుంకి రాజేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో శివకుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆ తర్వాత 2018లో ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో బీఎల్‌పీ పార్టీ నుంచి రైతు నాగలి గుర్తుపై పోటీచేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఆయనపై వేటేసిన కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల సమయంలో తిరిగి పార్టీలోకి చేర్చుకొని డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. అనంతర పరిణామాల్లో ఆయనకు డీసీసీ పీఠం దూరమైంది. ఇదే సమయంలో గత నాలుగేళ్లుగా దివంగత వెంకటేశ్వరరెడ్డి తనయుడు అభిజయ్‌రెడ్డి సైతం తరుచూ నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో, యువజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా డాక్టర్‌ పర్ణికారెడ్డి తాను సైతం రాజకీయ బాధ్యతలు స్వీకరిస్తానని, వచ్చే ఎన్నికల్లో మేనమామ తరఫున ప్రచారబాధ్యతలు తీసుకుంటానంటూ ప్రకటించడం గమనార్హం. మహిళలకు ఎమ్మెల్యే టికెట్లివ్వాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినా, లేక నియోజకవర్గంలో ఉన్న చిట్టెం నర్సిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి అనుచరులు, అభిమానులు చెదరకుండా చూసేందుకు పర్ణికారెడ్డిని రాజకీయాల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మేనమామకు టికెట్‌ వచ్చినా, చిట్టెం వారసురాలిగా తనకు టికెట్‌ ఇచ్చినా ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారని, అన్ని విషయాలపై తర్జనభర్జనలయ్యాకే క్రియాశీలకపాత్ర పోషించాలని నిర్ణయించినట్లు రాజకీయవర్గాల్లో చర్చసాగుతోంది.

చిట్టెం వారసులు ఎవరి దారి వారిదే..

డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి రాజకీయ ఎంట్రీ సందర్భంగా నారాయణపేట జిల్లాలో చిట్టెం నర్సిరెడ్డి వారసుల రాజకీయ ప్రస్తానంపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. చిట్టెం నర్సిరెడ్డి వారసులుగా రాజకీయాల్లో ఉన్న నాయకులు ఎవరికివారుగా వేర్వేరు పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్నారు. నర్సిరెడ్డి పెద్ద కుమారుడు, మక్తల్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఈయన 2005, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి 2005, 2014లో గెలుపొందారు. అనంతర పరిణామాల్లో బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన 2018లో కారు గుర్తుపై గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు చిట్టెం నర్సిరెడ్డి కూతురైన మాజీ మంత్రి డీకేఅరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రాష్ట్రంలో ప్రధాన నేతగా కొనసాగుతున్నారు. తాజాగా నర్సిరెడ్డి వారుసులుగానే చిట్టెం అభిజయ్‌, పర్ణికా నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. పర్ణికాను అవసరమైతే ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారంటూ రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

Updated Date - 2023-06-02T23:25:17+05:30 IST