సీలింగ్‌ భూములు హాంపట్‌

ABN , First Publish Date - 2023-02-08T22:54:06+05:30 IST

భూమిలేని నిరుపేదల కోసం పూర్వం ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్‌ భూములు ప్రస్తుతం రియల్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యజమానులకు ఎంతోకొంత ముట్టజెప్పి వాటిని దోచుకుంటున్నారు.

సీలింగ్‌ భూములు హాంపట్‌
సీలింగ్‌ భూముల్లో నిర్మించిన దాబా

ఏపీ- తెలంగాణ సరిహద్దులో రూ. 25 కోట్ల భూమి అన్యాక్రాంతం

నిషేధిత జాబితాలో ఉంచినా యథేచ్ఛగా ప్లాట్లు చేసి విక్రయాలు

రియల్టర్లకు అధికారుల వత్తాసు.. ఇళ్ల నెంబర్లు ఇచ్చి అనుమతులు

కర్నూలు పట్టణం పక్కనే ఉండటంతో ఈ ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌

సరిహద్దులో అనేక చోట్ల సీలింగ్‌ భూములు కబ్జా అవుతున్న పరిస్థితి

గద్వాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : భూమిలేని నిరుపేదల కోసం పూర్వం ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్‌ భూములు ప్రస్తుతం రియల్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యజమానులకు ఎంతోకొంత ముట్టజెప్పి వాటిని దోచుకుంటున్నారు. సీలింగ్‌ భూములను రిజిస్ర్టేషన్‌ చేయరాదని చట్టం ఉన్నా అధికారులు దానికి తూట్లు పొడుస్తుండటంతో కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజక వర్గంలోని అలంపూర్‌, ఉండవల్లి మండలాల్లో సీలింగ్‌ భూములు చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. గతంలో సంస్థానాల పరిధిలో ఉన్న భూములను సీలింగ్‌ యాక్ట్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎక్కువ భూమి ఉన్నవారి నుంచి తీసుకొని భూమిలేని నిరుపేదలకు పంచింది. కొన్నాళ్లపాటు ఆ భూముల్లోనే సదరు పేద రైతులు భూములు సాగుచేసుకొని జీవనం సాగించారు. అయితే ఈ సీలింగ్‌ భూముల పరిధిలో నుంచే జాతీయ రహదారి -44 రావడం, కర్నూలు పట్టణానికి భూములు అత్యంత చేరువలో ఉండటం, అయిదో శక్తిపీఠం అయిన జోగుళాంబ ఆలయానికి వెళ్లే అలంపూర్‌ చౌరస్తా ప్రాంతం చేరువలో ఉండటంతో భూములకు ఎనలేని డిమాండ్‌ వచ్చింది. దీంతో అటు ఏపీలోని పంచలింగాల, కర్నూలుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో పాటు ఇటు అలంపూర్‌ నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన కొంద రు చోటామోటా నాయకులు ఆ భూములపై కన్నేశారు. రైతులను భయపెట్టో లేక ఎంతోకొంత ముట్టజెప్పో ఆ భూములను తీసుకుంటున్నారు. పేద రైతులు కావడంతో వచ్చే కొద్దిమొత్తం డబ్బులకే ఆశపడి.. భూములను వారికి అప్పజెప్పుతున్న పరిస్థితులు ఉన్నాయి. అధికారుల పూర్తి సహకారం కూడా అక్రమార్కులకు ఉండటంతో కాసులపంట పండుతోంది.

యథేచ్ఛగా అనుమతులు..

గతంలో రికార్డు లను మ్యానువల్‌గా తారు మారు చేసినా.. ప్రస్తుతం ధరణి రావడంతో సీలింగ్‌ భూమి ఎవరికైతే కేటాయిం చారో వారి పేర్లే నమోద య్యాయి. కానీ గతంలో సృ ష్టించిన తప్పుడు రికార్డులతోనే ఇప్పుడు కూడా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ఈ తతంగంలో రెవెన్యూ, సబ్‌ రిజిస్ర్టార్‌ అధికారులు మా త్రమే కాకుండా.. ఇతర శాఖల అధికారుల భాగస్వామ్యం కూడా ఉంది. వాణిజ్య అవసరాలకు వినియో గించవద్దని సీలింగ్‌ యాక్ట్‌లో ఉంది. కానీ 451 సర్వే నెంబర్‌లోని ఈ భూమిలో లాడ్జ్‌, హోట ళ్లను నిర్మిస్తు న్నారు. వాటికి పంచాయ తీని ఇంటి నెంబర్లు రాగా.. వాణిజ్య అవసరాల కోసం మంజూరు చేసే ట్రాన్స్‌ ఫార్మర్లను కూడా విద్యుత్‌ శాఖ అధికారులు మంజూరు చేయించారు. వ్యవసాయ అవసరాలకు ట్రాన్స్‌ఫార్మర్‌కు డీడీలు తీశాక ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకునే విద్యుత్‌ అధికారులు.. నిషేధిత భూముల్లో వాణిజ్య అవసరాలకు ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేయడం గమనార్హం. ఇదే విషయమై ఏడీ సయ్యద్‌ మక్బూల్‌ హుస్సేన్‌ను వివరణ కోరగా.. తనకు సంబంధం లేదని, మండల స్థాయి అధికారులు ఇవ్వొచ్చని సమాధానం దాటవేశారు. ఏఈ అహ్మద్‌ను అడగ్గా పంచాయతీ కార్యదర్శి ఎన్‌ఓసీ ఇచ్చారని, దాని ఆధారంగా కేటగిరీ-2 కింద ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేశామని అంటున్నారు. ఇక ఇవే కాకుండా అలంపూర్‌ చౌరస్తాలో మరో స్థలం కూడా వివాదంలో ఉంది. ఇక్కడ కూడా సీలింగ్‌ యాక్ట్‌ కింద పంచిన భూములను కొందరు అధికార పార్టీకి చెందిన చోటమోటా నేతలు తీసేసుకొని.. యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. షోరూంలు, బహుళ అంతస్థుల భవనాలు సైతం నిర్మించుకుంటున్నారు. కొన్ని సీలింగ్‌ భూములకు సంబంధించి కోర్టుల్లో కేసులు ఉండగా.. ప్రభుత్వం నుంచి కౌంటర్‌ కూడా దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలలు అధికారులపై ఉన్నాయి.

రూ. 25 కోట్ల భూమికి ఎసరు

కర్నూలుకు సమీపంలోని తెలంగాణ సరిహద్దులో పుల్లూరు పంచాయతీ ఉంటుంది. దీని పరిధిలోని సర్వేనెంబర్‌ 451లో మొత్తం 13.3 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం ఇద్దరు రైతులకు చెరో రెండెకరాల చొప్పున నాలుగెకరాలు భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. నిబంధనల ప్రకారం సీలింగ్‌ యాక్ట్‌ కింద పొందిన భూమిని సదరు రైతులు క్రయవిక్రయాలు చేయడానికి వీల్లేదు. అలాగే దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవడానికి కూడా అవకాశం లేదు. అయితే కొన్నేళ్ల క్రితం ఏపీలోని పంచలింగాలకు చెందిన కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మ్యానువల్‌గా అధికారుల సహాయంతో రికార్డులు మార్పించుకొని ప్లాట్ల విక్రయాలు చేశారు. తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ధరణి రావడంతో ఆ భూములను నిషేధిత 22ఏ జాబితాలోకి ప్రభుత్వం చేర్చింది. మళ్లీ పాత యజమానులకే హక్కులు ఉన్నట్లు ధరణి రికార్డులో ఉన్నది. వాస్తవానికి ఆ యజమానులు ఎప్పుడో ఆ భూములను రియల్టర్లకు విక్రయించారు. క్రయావిక్రయాలు చేయకూడని భూముల్లో విక్రయాలకు రెవెన్యూ, సబ్‌ రిజిస్ర్టార్‌ అధికారులు అనుమతులిచ్చారు. ధరణి వచ్చి నిషేధిత జాబితాలో పొందుపర్చిన తర్వాత కూడా ధరణికి ముందు రిజిస్ర్టేషన్లు చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. సబ్‌ రిజిస్ర్టార్‌, రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ తతంగం అంతా నడుస్తోంది. జాతీయ రహదారిపై ఉండటం, పక్కనే పుల్లూరు టోల్‌ ప్లాజా ఉండటంతో ఇక్కడ ఎకరాకు సుమారు రూ. 6 కోట్ల పైనే ధర పలుకుతోంది. మొత్తం నాలుగెకరాలకు కలిపి రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.. సీలింగ్‌ భూములను రైతులు సద్వినియోగం చేసుకోకపోతే.. హక్కులను క్యాన్సిల్‌ చేసి.. ప్రభుత్వం తిరిగి తీసుకునే అవకాశం ఉంది. రూ. కోట్లు విలువ చేసే భూములను కారు చౌకగా రైతుల వద్ద కొని.. ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా.. అధికారుల్లో ఉలుకుపలుకు లేదు.

సీలింగ్‌ భూమిని ఆక్రమిస్తే చర్యలు

సీలింగ్‌ యాక్ట్‌ కింద ఇద్దరు లబ్ధిదారులకు సర్వే నెంబర్‌ 451లో నాలుగెకరాల భూమి కేటాయించిన విషయం వాస్తవమే.. కొన్ని కాలాలపాటు వారు సాగులో ఉన్న ఆ తర్వాత క్రయవిక్రయాలు జరిగి నట్లు మా దృష్టికి వచ్చింది. కబ్జాలో ఉన్నవారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. సదరు సీలింగ్‌ ల్యాండ్‌ను ప్రభుత్వ కబ్జాలోకి తీసుకుని, అమ్మిన, కొన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

- వీరభద్రప్ప, తహసీల్దార్‌, ఉండవల్లి

Updated Date - 2023-02-08T22:54:07+05:30 IST