‘బ్లడ్‌సెల్‌’

ABN , First Publish Date - 2023-05-31T23:34:03+05:30 IST

హిమోఫిలియా వ్యాధి బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ‘బ్లడ్‌సెల్‌’ అనే యాప్‌ను రూపొందించింది.

‘బ్లడ్‌సెల్‌’
మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో బాలుడికి ఇంజక్షన్‌ ఇస్తున్న వైద్య సిబ్బంది

- హిమోఫిలియా బాధితుల కోసం ప్రత్యేక యాప్‌

- ఈ నెల 9న ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

- ఏ జిల్లా వారు అదే జిల్లాలో పేరు నమోదు చేసుకోవాలి

- ఉమ్మడి జిల్లాలో చికిత్స పొందుతున్న 72 మంది బాధితులు

మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం) మే 31: హిమోఫిలియా వ్యాధి బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ‘బ్లడ్‌సెల్‌’ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో ఏ జిల్లాకు చెందిన బాధితులు అదే జిల్లాలో పేర్లు నమోదు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 72 మంది హిమోఫిలియా బాధితులు చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. కానీ వారు ఏ జిల్లాలో పేర్లు నమోదు చేసుకున్నారో తెలియడం లేదు. ఈ యాప్‌ ద్వారా అందరిని ఒకేచోట కలిపి వారికి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.

హిమోఫిలియా అంటే ...

హిమోఫిలియా వ్యాధి చాలా అరుదుగా వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి వలన బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి శరీరంలో ఎక్కడైన గాయమైతే రక్తం ఆగకుండా కారుతూ ఉంటుంది. ఇందుకోసం ఒక ఇంజక్షన్‌ ఇస్తారు. ఆ ఇంజక్షన్‌ విలువ బయటి మార్కెట్‌లో రూ. 40 వేలు ఉంటుంది. అదే ఇంజక్షన్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నారు. ఈ హిమోఫిలియా కేంద్రాలు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌లలో మాత్రమే ఉన్నాయి. గద్వాల్‌, నారాయణపేట జిల్లాలకు చెందిన బాధితులు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చికిత్స తీసుకోవలసి ఉంటుంది.

ప్రత్యేక యాప్‌ రూపకల్పన ...

రాష్ట్ర ప్రభుత్వం హిమోఫిలియా వ్యాధి బాధితు ల కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందిం చింది. ‘బ్లడ్‌సెల్‌’ అనే పేరుతో రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 9న హైదరాబాద్‌లో ప్రారంభించింది. హిమోఫిలి యా సొసైటీ ఆధ్వర్యంలో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఈ యాప్‌లో బాధితుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అదే జిల్లాలో వారి పేరు నమోదు చేసుకుంటే సకాలంలో వైద్య సేవలు అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్‌కార్డు, చిరునామా, ఇదివరకు వైద్యం ఎక్కడ చేయించుకున్నారు, ఏ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ చేశారు. అందుకు సంబంధించిన రిపోర్టులు, బ్లడ్‌గ్రూపు, ఫ్యాక్టర్‌ శాతం, ఇన్‌హిబీటర్‌ టెస్టు రిపోర్టులు తీసుకొని వెళ్లి స్థానిక జిల్లాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 72 మంది హిమోఫిలియా బాధితులు వైద్య సేవలు పొందుతు న్నారు. ఇందులో మహబూబ్‌నగర్‌ - 27, నాగర్‌కర్నూల్‌ - 16, వనపర్తి - 10, గద్వాల్‌ - 8, నారాయణపేట - 6, రంగారెడ్డి- 4, ఒక్కరు యాదాద్రి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బాధితులను ఆ జిల్లాల్లోని కేంద్రాల్లో వైద్య సేవలు అందుతున్నా యి. అక్కడే వైద్య చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మెరుగైన వైద్యం కోసమే...

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 72 మంది బాధితుల్లో ఏ జిల్లాలో వారి పేరుందో, వారి ప్రాంతం ఎక్కడో తెలియడం లేదు. అంతేకాకుండా చాలా మంది జిల్లా కేంద్రానికి చికిత్సకోసం వస్తుండడంతో ఫ్యాక్టర్‌ ఇంజక్షన్ల కొరత ఏర్పడుతోంది. వారికి అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదు. దీంతో ప్రభుత్వం రూపొం దించిన ఈ యాప్‌లో వారి పేర్లు నమోదు చేసుకోవడం వలన ఎక్కడెక్క డ ఇంజక్షన్లు ఉన్నాయి.. ఎక్కడ లేవు అని తెలుస్తుంది. ఎవరికైనా ఇంజ క్షన్లు కావాలంటే ఉన్నచోట నుంచి తెప్పించుకుని ఇచ్చే వీలుంటుంది. ప్రభుత్వానికి కూడా ఎంతమేరకు ఇంజక్షన్లు అవసరమో తెలుస్తుంది. అంతేకాకుండా బాధితులకు ప్రభుత్వం, సొసైటీ నుంచి ఇతర ప్రయో జనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Updated Date - 2023-05-31T23:34:03+05:30 IST