బావాజీ జాతరకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2023-03-25T23:22:10+05:30 IST

గిరిజనుల అధ్యాత్మిక గురువు బావాజీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

బావాజీ జాతరకు ఏర్పాట్లు చేయాలి
సమీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, పాల్గొన్న కలెక్టర్‌

- కలెక్టర్‌ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, మార్చి 25 : గిరిజనుల అధ్యాత్మిక గురువు బావాజీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ మద్దూర్‌ మండలం తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర ఏర్పాట్లపై అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాకు నలు మూలల నుంచి వస్తారని, వచ్చేనెల 5 నుంచి 8వ తేదీ వరకు జాతర జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. జాతర సందర్భంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, తాగేందుకు మిషన్‌ భగీరథ నీటిని అందించడం జరుగుతుందని వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రోడ్డు పనులు చేపట్టాలని, దుకాణాలను ఆలయానికి దూరంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా ట్రాన్స్‌ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, ఆలయానికి దూరంగా పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని, రథోత్సవం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరలో కంట్రోల్‌ రూం ఏర్పాటుతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌ బలగాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రం, పాత పాలమూరు నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, భక్తులకు అసౌకర్యం కల్గకుండా చూడాలన్నారు. పరిసర గ్రామాల నుంచి యువతను వలంటీర్లుగా నియమించేందుకు ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని, జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జాతర పోస్టర్లను విడుదల చేశారు. అంతకుముందు వీసీ ద్వారా మద్దూర్‌ మండల అధికారులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అధికారులను కోరారు. మద్దూర్‌ మండలంలో 28 పాఠశాలలో ఎంపిక చేయగా అన్ని పాఠశాలలు ప్రారంభోత్సవాన్ని సిద్ధంగా ఉన్నాయని, కొన్నిచోట్ల మౌలిక వసతుల ఏర్పాట్లలో జాప్యం జరుగుతుందని వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్‌ ఆఖరు నాటికి అన్నీ పాఠశాలలు ప్రారంభించేలా చూడాల న్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నవాటిలో ఫర్నిచర్‌ తరలిస్తున్నామన్నారు. జిల్లా అధికారులు గోపాల్‌, రాంచందర్‌, నరేందర్‌, మురళి, జడ్పీటీసీ సభ్యుడు ప్రకాష్‌రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:22:10+05:30 IST