దశాబ్ది ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-05-26T22:54:27+05:30 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయను న్నట్లు జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

దశాబ్ది ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, మే 26 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయను న్నట్లు జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో శుక్రవారం నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. వచ్చే నెల రెండు నుంచి 22 వరకు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి, అందుకు చేయాల్సిన ఏర్పాట్లను వివరించారు. ప్రతీ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి, విజయవంతం చేయా లన్నారు. తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిపై అన్ని శాఖల అఽధికారులు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరయ్యేలా చూడాలన్నారు. మండల కార్యాలయాలను పూల తోరణాలతో అలంకరించాలని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతికి ముందు తర్వాత జరిగిన పనులపై నివేదికను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతీ కార్యక్రమానికి దశాబ్ది లోగోను వినియోగించాలన్నారు. ఇరిగేషన్‌ శాఖ వారు చెరువుల అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. చేపలు పట్టే వారిని మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువు కట్టల దగ్గర భోజనాలు పెట్టాలన్నారు. ఒక్కో ప్లాట్‌ 75 చదరపు గజాల ఇంటి స్థలం ఉండేలా లేఅవుట్‌ తయారు చేసి పట్టాల పంపిణీకి సిద్ధం కావాలన్నారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. కుల వృత్తుల వారిని గుర్తించి, పేర్లు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, ఆర్డీవో రాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T22:55:04+05:30 IST