డబుల్ ఇళ్లు దక్కేనా?
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:08 PM
ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా పేదల సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదని అని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- తీరని సొంతింటి కల - లక్కీ డ్రా తీసి ఎనిమిది నెలలు అవుతోంది
- నేటికీ ఇళ్లు కేటాయించకపోవడంతో అందోళనలో లబ్ధిదారులు
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 26 : ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా పేదల సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదని అని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల కేటాయింపు కోసం ఎనిమిది నెలల క్రితం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ ఇళ్లు కేటాయించలేదు. ఇంతలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం లబ్ధిదారులను కొత్తగా ఎంపిక చేసి వారికే ఇళ్లను కేటా యిస్తుందని, గతంలో ఎంపికైన తాము ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో ఇళ్లు లేని పేద వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించేందుకు గతంలో ధరఖాస్తులు స్వీకరించింది. ఇందులో 4,000 దరఖాస్తులు వచ్చాయి. 1,275 డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించారు. ఎనిమిది నెలల క్రితం కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో 770 ఇళ్లకు లక్కీడీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో కొందరు కోర్డుకు వెళ్లడంతో మిగతా 505 ఇళ్లకు లక్కీడీప్ నిర్వహించలేదు. అయితే ఎన్నికల కోడ్ సమీపిస్తుండటంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఐదుమందికి మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఎన్నికలు ముగిసిన కూడా అధికారులు వారిని ఆ ఇళ్ల్లలోకి వెళ్లనివ్వడంలేదనే అరోపణలు వస్తున్నాయి.
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటున్నారు
గతంలో లక్కీడిప్ తీసినప్పుడు నా పేరు తగిలింది. ప్రభుత్వం మారిందని, మళ్లీ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇదే తతంగం ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. దీనిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలి. లక్కీడిప్‌లో ఎంపికైనా వారికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వాలి.
- కుమారి, తెలుగుపేట, గద్వాల