డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అర్హులకందేనా?

ABN , First Publish Date - 2023-01-25T00:07:46+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపునకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికకోసం అధికారులు చేపట్టిన విచారణ సోమవారంతో ముగిసింది.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అర్హులకందేనా?
దరఖాస్తులపై విచారణ నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)

- 560 ఇళ్లకు 3,916 దరఖాస్తులు

- విచారణ పూర్తి చేసిన అధికారులు

గద్వాల క్రైం, జనవరి 24 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపునకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికకోసం అధికారులు చేపట్టిన విచారణ సోమవారంతో ముగిసింది. అంతా బాగానే ఉంది కానీ రాజకీయ అండదండలు ఉన్న వారికే ఇళ్లు ఇస్తారా? లేక అధి కారులు విచారణ చేపట్టి గుర్తించిన అర్హులకు ఇస్తారా అన్న విషయంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మండల పరిధిలోని గోనుపాడు గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించి దరఖాస్తుదారుల విచారణ పూర్తయి చాలా కాలమైనా ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రస్తుతం ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. అలాగే పర్మాల శివారులో 1,275 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. వాటిలో ఇప్పటివరకు 560 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 715 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయి. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు గత ఏడాది ఆదేశాలు చేశారు. దీంతో 3,916 మంది దరఖాస్తు చేసుకున్నారు.

విచారణ చేపట్టిన 12 బృందాలు

పర్మాల శివారులోని 560 ఇళ్లకు వచ్చిన 3,916 ధరఖాస్తుదారులలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. ఇందుకోసం 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం 252 నుంచి 300 వరకు దరఖాస్తులపై విచారణ నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 26 నుంచి ఈ నెల 23 వరకు జిల్లా కేంద్రంలో విచారణ పూర్తి చేసి, జిల్లా అధికారులకు మంగళవారం అర్హుల జాబితాను సమర్పించారు.

ఇళ్ల కేటాయింపు ఎప్పుడు?

అధికారుల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా, అర్హులకు మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. గతంలో గద్వాల మండల పరిధిలోని గోనుపాడులో 25 డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఇళ్ల నిర్మాణం, అర్హుల ఎంపిక పూర్తయి చాలా కాలమైన లబ్ధిదారులకు అప్పగించలేదు. ప్రస్తుతం ఆ ఇళ్లు శిథివాస్థకు చేరుకుంటున్నాయి. ఈ సారైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సకాలంలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలన్న సూచనలు వినిపి స్తున్నాయి. అలాగే నర్సింగ్‌ కళాశాల స్థలంలో గతంలో ఉన్న ప్లాట్ల లబ్ధిదారులకు కూడా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉండొచ్చని సమాచారం.

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

అర్హులందరికీ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందేలా కృషి చేస్తాం. అర్హుల విచారణ ప్రక్రియ సోమవారం పూర్తయ్యింది. వారిలో అర్హులైన వారికి తప్పకుండా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందేలా చూస్తాం. ఆర్ధికంగా వెనుకబడిన వారినే ఎంపిక చేస్తామన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తాం. అందరికీ న్యాయం చేయడమే మా లక్ష్యం.

- వల్లూరు క్రాంతి, కలెక్టర్‌.

Updated Date - 2023-01-25T00:08:08+05:30 IST