Share News

పంచాయతీ నిధుల స్వాహాకు యత్నం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:07 PM

గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగుస్తుండటంతో ఖాతాలను ఖాళీ చేసేందుకు సర్పంచులు ప్రయత్నిస్తున్నారు. గ్రామ కార్యదర్శులు, పంచాయతీ ఏఈలతో చేతులు కలిపి.. అసంబద్ధ ఎంబీ రికార్డులను తయారు చేసి, నిధులు విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.

పంచాయతీ నిధుల స్వాహాకు యత్నం
పూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం

జోగుళాంబ గద్వాల జిల్లాలో రూ.9.50 కోట్ల ఆర్థిక, ఎస్‌ఎఫ్‌సీ నిధులు

ఇప్పటికే రూ.మూడు కోట్ల అడ్వాన్స్‌లు సర్పంచుల చేతుల్లోనే..

వారితో చేతులు కలుపుతున్న ఏఈలు

అసంబంధ ఎంబీ రికార్డులు తయారు

కలెక్టర్‌, పంచాయతీ అధికారులపై నాయకుల ఒత్తిడి

కాలపరిమితి ముగుస్తుండటంతో ఖాతాలు ఖాళీ చేసేందుకు యత్నం

గద్వాల, డిసెంబరు 17: గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగుస్తుండటంతో ఖాతాలను ఖాళీ చేసేందుకు సర్పంచులు ప్రయత్నిస్తున్నారు. గ్రామ కార్యదర్శులు, పంచాయతీ ఏఈలతో చేతులు కలిపి.. అసంబద్ధ ఎంబీ రికార్డులను తయారు చేసి, నిధులు విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. వీరికి నియోజకవర్గ నాయకులు వత్తాసు పలికి బిల్లులు చెల్లించాల్సిందేనని పట్టుపడుతున్నారు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులో అధికారులు ఉన్నారు. జిల్లా పంచాయతీలో రూ.9.50 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. నెల రోజుల్లో వీటిని ఖాళీ చేసేందుకు సిద్ధం అయ్యారు.

గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ నెల ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నది. మధ్యలో కొంత ఆలస్యం అయినా.. తర్వాత నిధులు విడుదల చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పీఎ్‌ఫఎంఎ్‌స(పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) తెచ్చిన తర్వాత నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేస్తున్నది. టైడ్‌ గ్రాంట్స్‌ (ప్రాధాన్యత నిధులు) నిర్దేశించిన పనులకు ఖర్చు చేస్తుండగా, అన్‌ టైడ్‌ గ్రాంట్స్‌ను సర్పంచులు తమకు నచ్చిన చోట ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులు, సాధారణ నిధులు.. కార్మికుల వేతనాలు, విద్యత్‌ బిల్లులు, ట్రాక్టర్‌ కంతులు పోను మిగిలినవి సర్పంచులకు నచ్చిన చోట, సమస్యలు ఉన్న చోట ఖర్చు చేశారు. వాటికి ఆయా గ్రామ కార్యదర్శులు తీర్మానాలు ఇచ్చి, ఏఈల ద్వార ఎంబీ రికార్డులు చేసి బిల్లులు చెల్లించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికల సమయంలో దిగిపోతున్న ప్రభుత్వం... రూ.9.50 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేసి వెళ్లింది. దిగిపోతున్న సర్పంచులకు ఇది వరంగా మారింది.

చేయని పనులకు తీర్మానాలు ఎంబీ రికార్డులు

జిల్లా పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.30 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులు రూ4.20 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 20 రోజుల కిత్రమే ప్రభుత్వం జమ చేసింది. అయితే ఇందులో 15వ ఆర్థిక సంఘం నిధులు టైడ్‌ గ్రాంట్స్‌.. పారిశుధ్యం, తాగునీటికి ఖర్చు చేయాలి. ఎస్‌ఎ్‌పసీ ఇష్టానుసారంగా ఖర్చు చేయవచ్చు. ఇదే అదనుగా భావించిన సర్పంచులు శాశ్వత పనులు కాకుండా పారిశుధ్య పనులు చేశామని, పైపులైన్‌లు, మోటార్లను మరమ్మతులు చేయించామని ఎంబీ రికార్డులు తయారు చేశారు. అదేవిధంగా వీధిలైట్లు వేశామని, నెల రోజుల్లోనే రెండుసార్లు వేశామని ఇలా అసంబద్ధ రికార్డులను తయారు చేశారు. వీరికి కొందరు పంచాయతీ కార్యదర్శులు తీర్మానాలు ఇవ్వగా, కొందరు పంచాయతీ ఏఈలు ఎంబీ రికార్డులు తయారు చేయడం కొసమెరుపు. ఐదేళ్లుగా గ్రామాన్ని పట్టించుకోలేదని సర్పంచ్‌లపై ఫిర్యాదులు రాగా.. ఇప్పుడు అభివృద్ధి చేశామని బిల్లులు పెట్టడంపై అనుమానం వచ్చి పరిశీలిస్తే అసంబంధ ఎంబీ రికార్డులు వెలుగులోకి వచ్చాయి. అసలు బండారం బయట పడటంతో నియోజకవర్గ నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఉదాహరణకు రాజోలిలో 22 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారు కాక ప్రతీ నెల రూ.1.50 లక్షలు పారిశుధ్యానికి ఖర్చు చేస్తున్నట్లు రికార్డు చేశారు. గట్టు మండల కేంద్రం, అయిజలోని మేడికొండ, కేటీదొడ్డిలోని వెంకటాపురం, గద్వాల మండలంలోని పూడూరు ఇలా అనేక గ్రామ పంచాయతీలు ఈ కోవలోనే ఉన్నాయి.

బిల్లులు చెల్లించినా అడ్వాన్స్‌లు ఇవ్వని సర్పంచ్‌లు

మరో 45 రోజులు.. అంటే జనవరి 31వ తేదీతో గ్రామ సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నది. అయితే.. సర్పంచులకు ఇచ్చిన అడ్వాన్స్‌లు వారి చేతుల్లోనే ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు గ్రామ కార్యదర్శులు వాళ్ల నుంచి వసూలు చేసి పంచాయతీ ఖాతాలలో జమ చేయడం లేదు. ఇవి గ్రామాలలో ఉపాధి నిధులతో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్లు, రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాల సమయంలో పంచాయతీ నిధుల నుంచి అడ్వాన్స్‌ల రూపంలో ఇచ్చారు. ఈ పనులకు సంబంధించిన ఉపాధి బిల్లులు ఎప్పుడో సర్పంచులకు చెల్లించింది. తీసుకున్న అడ్వాన్స్‌ను గ్రామ పంచాయతీ ఖాతాకు జమ చేయాలి. కానీ చాలా మంది సర్పంచులు తిరిగి చెల్లించలేదు. ఇలా సర్పంచుల చేతుల్లో దాదాపు రూ.మూడు కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఉదాహరణకు గ ద్వాల మండలంలోని మేలచెరువు సర్పంచు వై కుంఠధామ నిర్మాణానికి రూ. మూడు లక్షలు రెండేళ్ల క్రితం అడ్వాన్స్‌ రూపంలో తీసుకున్నారు. ఆ పనికి సంబంధించిన బిల్లు ఏడాది కిత్రమే సర్పంచు చేతికి వచ్చినా.. ఇప్పటి వరకు తీసుకున్న అడ్వాన్స్‌ చెల్లించలేదు. ఇలా చాలా మంది సర్పంచుల చేతుల్లోనే అడ్వాన్స్‌లు ఉన్నాయి. వాస్తవంగా చేసిన పనులకే బిల్లులు చెల్లించాలని, తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి జమ చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. పదవి ముగుస్తున్న సమయంలో చెల్లించే బిల్లులపై అధికారులు విచారణ చేసి, వసూలు చేయాలని కోరుతున్నారు.

వాస్తవ పనులకు బిల్లులు చెల్లిస్తాం

జిల్లాలో రూ.9.50 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. వాస్తవంగా పనులు చేస్తే బిల్లులు చెల్లిస్తాం. అయితే ముందుగా కార్మికుల వేతనాలు, విద్యుత్‌ చార్జీలు, ట్రాక్టర్‌ కంతులు కట్టిన తర్వాతనే బిల్లులు చెల్లిస్తాం. పంచాయతీ తీర్మానాలు, 2022-23 ఆడిట్‌ రిపోర్టు, తీసుకున్న అడ్వాన్స్‌లకు క్లియరెన్స్‌ ఉంటేనే బిల్లులు ఇస్తాం. కొందరు పనులు చేయకుండానే ఎంబీ రికార్డులు చేయించారని ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ చేయిస్తాం.

- శ్యామ్‌సుందర్‌, జిల్లా పంచాయతీ అధికారి, గద్వాల

Updated Date - Dec 17 , 2023 | 11:07 PM