వణికిస్తున్న మిచౌంగ్
ABN , First Publish Date - 2023-12-05T23:51:42+05:30 IST
మిచౌంగ్ తుపాను ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడింది. చలి తీవ్రత పెరిగింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలి గాలులు వీస్తున్నాయి. దాంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు మంట కాచుకోవడంతో పాటు.. స్వెటర్లు ధరిస్తున్నారు.
తుపాను ప్రభావంతో పడిపోయిన ఉష్ణోగ్రతలు
నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ముసురు వాన
కల్లాలు, మార్కెట్లలో తడిసిన ధాన్యం, మిరప
చలి గాలులకు జనం ఉక్కిరిబిక్కిరి
నారాయణపేట/నాగర్‌కర్నూల్ టౌన్/మన్ననూరు/ఇటిక్యాల/ మాన వపాడు, డిసెంబరు 5: మిచౌంగ్ తుపాను ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడింది. చలి తీవ్రత పెరిగింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలి గాలులు వీస్తున్నాయి. దాంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు మంట కాచుకోవడంతో పాటు.. స్వెటర్లు ధరిస్తున్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో జల్లుతో కూడిన వర్షం పడింది. దాంతో కల్లాల్లో ధాన్యం, మిర్చి పంటలు తడిసిపోయాయి. ఉదయం పొగమంచు తీవ్రంగా ఉండటంతో రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ప్రత్యేక తరగతులకు వెళ్లే విద్యార్థులు, వీధులను శుభ్రం చేసే పారిశుధ్య సిబ్బంది చలికి అవస్థలు పడుతున్నారు.
తగ్గిన ఉష్ణోగ్రతలు
నారాయణపేట జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు ఈ నెల ఐదున గరిష్ఠంగా 28 డిగ్రీలు నమోదవగా.. కనిష్ఠంగా 22 డిగ్రీలుగా నమోదైంది. నాల్గున గరిష్ఠంగా 30, కనిష్ఠంగా 22 డిగ్రీలు, మూడున గరిష్ఠంగా 32, కనిష్ఠంగా 22, రెండున గరిష్ఠంగా 32, కనిష్ఠంగా 21, ఒకటిన గరిష్ఠంగా 32, కనిష్ఠంగా 20 డిగ్రీలుగా నమోదైంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షం
తుపాను ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అక్కడక్కడ ముసురు వాన కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై చలి గాలులు వీచాయి. జిల్లాలోని అమ్రాబాద్, పదర మండలాల్లో ముసురు వాన కురువగా, అచ్చంపేట, బల్మూరు, వంగూరు, నాగర్‌కర్నూల్ మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పదర మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 19.9 డిగ్రీలు నమోదవగా, పదరలో 20, ఉప్పునుంతలలో 20.1, అచ్చంపేటలో 20.2 డిగ్రీలుగా నమోదైంది. అకాల వర్షాలతో కల్లాలో ఆరబోసిన, మార్కెట్ యార్డుకు విక్రయానికి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
ప్రధాన రహదారిపై వర్షపు నీరు
తుపాను నేపథ్యంలో కురుస్తున్న ముసురు వర్షాలకు రహదారులన్నీ చిత్తడిగా మారాయి. అమ్రాబాద్ మండలంలోని మన్ననూరులో జాతీయ రహదారి చాలా రోజులుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దుర్వాసుల చెరువు వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా ఉండే రహదారి 10 ఏళ్ల క్రితం మరమ్మతులు చేశారు. రహదారి ఎత్తును పెంచాల్సి ఉండగా జాతీయ రహదారుల నిర్వహణాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. హోటళ్లు, ఇళ్ల ముందర ఎవ్వరికి వారుగా మొర్రం మట్టిని పోసుకుంటుండటంతో నీళ్లన్నీ రహదారిపైనే చేరుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కూడా లేకపోవడంతో ఇళ్లలోని నీరు సైతం రహదారిపైకి వచ్చి చేరుతోంది. రహదారికి మరమ్మతులు చేయాలని జనం కోరుతున్నారు.
తడుస్తున్న మిరప
తుపాన్ ప్రభావంతో పడుతున్న చిరుజల్లులు జోగుళాంబ గద్వాల జిల్లాలో మిరప రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటిక్యాల మండలంలోని శివనంపల్లి, ఇటిక్యాల, సాతర్ల, వావిలాల, మొగలిరావుల చెర్వు, ఉదండాపురం, పెద్దదిన్నె, చాగాపురం తదితర గ్రామాల్లో మిరప కాయ తెంపి కల్లాల్లో ఆరబెట్టుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు పడ్తుండటంతో పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పుకున్నారు. కొంతమంది రైతుల మిరపకాయ తడిసిపోయింది. మానవపాడు మండలంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ముసురు పడ్తుండటంతో మిర్చి, పత్తి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పత్తి చేతికి వచ్చే సమయంలో వర్షం పడుతుండటంతో తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి నాని నల్లగా మారుతోందని అంటున్నారు.