Share News

రికార్డుల పరంపర

ABN , First Publish Date - 2023-12-04T23:11:03+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్నో రికార్డులను నమోదు చేశాయి. కాంగ్రెస్‌కు చరిత్రలో లేని విధంగా 12 సీట్లు కట్టబెడితే, తొమ్మిది మంది కొత్త వారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఈ ఎన్నికల్లో దక్కింది.

రికార్డుల పరంపర

కాంగ్రెస్‌కు చరిత్రలో మొదటిసారి పాలమూరులో 12 సీట్లు

ఎమ్మెల్యేలుగా ముగ్గురు డీసీసీ అధ్యక్షులు

ఆరోసారి అసెంబ్లీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

పట్టువదలని విక్రమార్కుడు డాక్టర్‌ వంశీకృష్ణ

హ్యాట్రిక్‌ మిస్సయిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ఎనిమిది వ ుందికి తొలి ప్రయత్నంలోనే దక్కిన విజయం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్నో రికార్డులను నమోదు చేశాయి. కాంగ్రెస్‌కు చరిత్రలో లేని విధంగా 12 సీట్లు కట్టబెడితే, తొమ్మిది మంది కొత్త వారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఈ ఎన్నికల్లో దక్కింది. తండ్రి ఐదుసార్లు పోరాడినా దక్కని విజయం కుమారుడి రూపంలో నాగర్‌కర్నూల్‌లో డాక్టర్‌ రాజేష్‌రెడ్డి సాధించగా.. తాత, తండ్రి నక్సలైట్ల తూటాలకు బలైన రోజు బాలికగా ఉన్న డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి నారాయణ పేటలో తొలి ప్రయత్నంలో విజేతగా నిలిచారు. అతిసా మాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యో గం చేస్తోన్న విజయుడు అలంపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయం నమోదు చేశారు.

రేవంత్‌ సారథ్యంలో

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ మొదటి సారి చరిత్రను తిరగరాసింది. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. క్షేత్ర స్థాయిలో అత్యంత బలంగా ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ను తోసిరాజని రేవంత్‌ చాతుర్యంతో పాలమూరులో కాంగ్రెస్‌కు అధిపత్యం దక్కింది. 1967, 1972 ఎన్నికల్లో పాలమూరులో తొమ్మిది స్థానాల్లోనే కాంగ్రెస్‌ గెలవగా, 1989లో కాంగ్రెస్‌ హవా నడిచిన సందర్భంలోనూ ఉమ్మడి జిల్లాలో 11 సీట్లే దక్కాయి. 2004 సహా ఆతర్వాత ఏ ఎన్నికల్లోనూ అయిదారు సీట్లుకు మించి కాంగ్రెస్‌ సాధించ లేదు. 1994లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో టీడీపీకి 11 సీట్లు వస్తే, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ గాలిలో బీఆర్‌ఎస్‌కు 13 సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు మాత్రం మొదటిసారి రేవంత్‌ సారథ్యంలో 14కి 12 సీట్లు దక్కడం విశేషం.

నాలుగో ప్రయత్నంలో విజయం

అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిన డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి విజయాన్ని కైవసం చేసుకున్నారు. 2004లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు పడ్డారు. గత ఎన్నికల తర్వాత అధికార బీఆర్‌ఎస్‌ నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు. నమ్మిన సిద్ధాంతాలతో కాంగ్రెస్‌లోనే కొనసాగారు. తాను ఇబ్బందులు పడు తున్నా సతీమణి డాక్టర్‌ అనూరాధను సైతం క్రియాశీల రాజకీయాల్లోకి తెచ్చారు. ఆమె రెండో పర్యాయం జడ్పీటీసీ సభ్యురాలిగా, జడ్పీఫ్లోర్‌ లీడర్‌గా కొనసా గుతున్నారు. భార్యా భర్తలిద్దరు రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు చేరువై.. ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వారికి హ్యాట్రిక్‌ మిస్‌

ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని తాపత్రయపడ్డ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆ అవకాశం దక్కలేదు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన అంజయ్యయాదవ్‌, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సుంకి రాజేందర్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి హ్యాట్రిక్‌ మిస్సయ్యారు. వీరిలో డాక్టర్‌ లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మూడు సార్లు గెలు పొందినప్పటికీ వరుస విజయాలు కాకపోవడంతో హ్యాట్రిక్‌ కోరిక నెర వేరలేదు.

జూపల్లి సీనియర్‌ లెజిస్లేటర్‌

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలందరిలో సీనియర్‌ లెజిస్లేటర్‌ జూపల్లి కృష్ణారావు. ఈయన ఆరోసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టనున్నారు. 1999లో మొదటిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి 2004లో స్వతంత్ర అభ్యర్థిగా, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2012 ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. దివంగత వైఎస్‌ఆర్‌, రోశయ్య కేబినెట్‌లలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో స్వల్పకాలం దేవాదాయశాఖ మంత్రిగా ఆయన పని చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ తొలి కేబినెట్‌లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ను వీడిన ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరి ఈఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

తిరగరాసిన రికార్డులు

ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షులుగా, పార్టీల జిల్లా అధ్యక్షులుగా పని చేసిన నాయ కులకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు దక్కకపోవడంతో ఆ నాయకులు ఇతర పదవుల్లో సర్ధుకుపోయేవారు. కానీ ఈఎన్నికలు ఆ రికార్డును తిరగరాశాయి. ఈ ఎన్నికల్లో ఏకంగా ముగ్గురు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిస్తే, నారా యణపేట డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి మక్తల్‌ ఎమ్మెల్యేగా, నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మరో మైలురాయి

ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది నాయకులు ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. డాక్టర్‌ చిట్టెం పర్ణిక(నారాయణపేట), వాకిటి శ్రీహరి(మక్తల్‌), మధు సూదన్‌రెడ్డి (దేవరకద్ర), అనిరుధ్‌రెడ్డి(జడ్చర్ల), శంకర్‌ (షాద్‌నగర్‌), డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి(నాగర్‌కర్నూల్‌), తూడి మేఘారెడ్డి (వనపర్తి), కె.విజయుడు (అలంపూర్‌) మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలుగా గెలవడం పాలమూరు చరిత్రలో మరో మైలురాయిగా చెప్పొచ్చు.

Updated Date - 2023-12-04T23:11:21+05:30 IST