బంపర్ ఆఫర్
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:11 PM
మోటార్‌వాహన చట్టం ఉల్లంఘించిన వాహనాలపై వేస్తున్న జరిమానా కేసులు గుట్టల్లా పేరుకుపోయాయి..
- ఈ చలానా రాయితీపై జీవో విడుదల
- మంగళవారం నుంచే చెల్లింపునకు లైన్ క్లియర్
- అందుబాటులోకి వచ్చిన సైట్
- ఆసక్తి చూపుతున్న వాహనదారులు
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిమానాలు రూ.47 కోట్లు
మహబూబ్‌నగర్, డిసెంబరు 26: మోటార్‌వాహన చట్టం ఉల్లంఘించిన వాహనాలపై వేస్తున్న జరిమానా కేసులు గుట్టల్లా పేరుకుపోయాయి.. జరిమానా వసూలు చేయడం అధికారులకు తలకుమించిన భారం అవడంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం భారీ రాయితీ ఇవ్వనున్నట్లు మూడ్రోజుల క్రితం ప్రకటించింది. ఈ నెల 26నుంచి జనవరి 10 వరకు చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుందని వెల్లడించడంతో జరిమానా ఉన్న వాహనదారులు ఈ చలానా చెల్లింపులకు ఆన్‌లైన్‌లో వెతికే పనిలో పడ్డారు. సైట్ ఓపెన్ కాకపోవడంతో నిరాశ చెందారు. అయితే రాయితీకి సంబంధించిన జీవోను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయడంతో సైట్ ఓపెన్ అవుతున్నది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఆటో, ద్విచక్రవాహనాలకు 80 శాతం, కార్లు, భారీ వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించారు. 15 రోజుల గడువు ఉండటంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 2021లోనూ ఈ చలానాలపై ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో పెద్దఎత్తున జరిమానాలు వసూలయ్యాయి. ఇప్పుడు కూడా బకాయిలు భారీ మొత్తంలో వసూలు కానున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ చలానా రూపంలో దాదాపు రూ.47.64 కోట్ల బకాయిలున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి 9 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. పోలీసులకు ఉన్నతాధికారులు టార్గెట్‌లు విధించి ఈ చలానా కేసులు వేయిస్తుండటంతో పోలీసులు అదే పనిగా ఓవర్‌స్పీడ్, ట్రిపుల్‌రైడింగ్, హెల్మెట్ ఫెనాల్టీలు, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌పార్కింగ్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి వారికి జరిమానా విధిస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనాలు తమ వాహనాలకు నెంబర్‌ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. కొందరు నెంబర్‌ప్లేట్‌లోని ఒక నెంబర్‌మిస్ చేయడం లేదంటే నెంబర్ కనిపించకుండా చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 1.99 లక్షల కేసుల్లో రూ.9.36 కోట్లు, నారాయణపేట జిల్లాలో 1.80 లక్షల కేసుల్లో రూ.9.28 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 76 వేల కేసుల్లో రూ.5.50 కోట్లు, వనపర్తి జిల్లాలో 2.58 లక్షల కేసుల్లో రూ.13.1 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2.18 లక్షల కేసుల్లో రూ.10.09 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నది. ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో రాయితీ పోను మూడొంతుల జరిమానా వసూలు కానున్నాయి.