ఐదేళ్లలో 1339 రోడ్డు ప్రమాదాలు
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:43 PM
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడపడంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు.
- 2019 నుంచి ఇప్పటి వరకు 735 మంది మృతి, 1,319 మందికి గాయాలు
- రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్‌గన్ ఏర్పాటు
నారాయణపేట, డిసెంబరు 26 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడపడంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలను ఫణంగా పెడుతుండగా, మరికొందరు అతి వేగంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2019 నుంచి ఐదేళ్లలో మొత్తం 1,339 రోడ్డు ప్రమాదాలు జరగగా, 735 మంది మృతి చెందారు. 1,319 మంది గాయపడ్డారు.
- ఏటేటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో నేషనల్ హైవే 56 కిలో మీటర్లు, స్టేట్ హైవేలు ఉండగా, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్స్, యాక్సిండెంట్ ప్రోన్ ఏరియాస్‌ను గుర్తించారు. మరికల్ సర్కిల్‌లో తొమ్మిది, మక్తల్‌లో 18 ఇలా మొత ్తం 27 సర్కిళ్లను గుర్తించి సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్‌సైన్ బోర్డులు, బారీ కేడ్స్ ఏర్పాటు చేయించారు. వాహనాల తనిఖీలు, ఎన్‌హెచ్ 167పై వేగ నియంత్రణ గురించి స్పీడ్ గన్‌తో జరిమానాలు విధిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ తదితర కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ పీఎస్‌ల పరిధిలో ఎస్‌ఐలు, కళా బృందం, షీ టీమ్స్ రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల డేంజర్ స్పాట్‌లను గుర్తించడంతో పాటు ప్రమాదకర మలుపులను తగ్గించి హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కూడళ్లలో జీబ్రా రోడ్ క్రాసింగ్ సూచించే పేయింటింగ్ వేయించి, అతివేగ నియంత్రణ కోసం జాతీయ రహదారి అయిన మరికల్, రాయచూర్ అంతరాష్ట్ర రోడ్డుపై స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేశారు. అంతరాష్ట్ర రహదారిపై వాహనాలు 80 కిలో మీటర్ల వేగం దాటితే హైవేపై అటోమెటిక్‌గా వాహనదారులకు స్పీడ్ గన్ ద్వారా జరిమానా పడుతోంది. నేషనల్ హైవే, తదితర రహదారులపైన వాహనదారులు అనవసరంగా వాహనాలను నిలిపినా, అనుకోకుండా రోడ్డుపై ఆగిపోయినా, వాటి వెనుక స్టిక్కర్లు, గుర్తులు అతికించకుండా ఉండి ఇతరుల రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు కారణమైతే వారిపై ఐపీసీ 304 ఏకి బదులుగా ఐపీసీ 304 పార్ట్ -2 ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం సదరు వాహనదారులకు పదేళ్ల జైలుశిక్ష పడుతుందని చెబుతున్నారు. అయితే నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు.