Kishan Reddy : వరంగల్ పర్యటనలో కిషన్ రెడ్డికి ఊహించని షాక్..!
ABN , First Publish Date - 2023-07-30T12:43:33+05:30 IST
వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించడానికి వరంగల్ జిల్లాలో (Warangal) ఆయన పర్యటిస్తున్నారు..
తెలంగాణలోని లంబాడీలపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు (MP Soyam Bapurao) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయనపై లంబాడ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంత జరిగినా ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని లంబాడ సంఘాల నేతలు బీజేపీ నేతలను నిలదీస్తున్నారు. ఆదివారం నాడు జనగామకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (TS BJP Chief Bandi Sanjay) లంబాడ నేతలు షాకిచ్చారు. ఎంపీ సోయం బాబూరావును సస్పెండ్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కిషన్ రెడ్డికి గిరిజన సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. అయితే.. సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించడానికి వరంగల్ జిల్లాలో (Warangal) ఆయన పర్యటిస్తున్నారు.
రేపు తెలంగాణకు కేంద్ర బృందం..!
పర్యటనలో భాగంగా జనగామలో మీడియాతో మాట్లాడిన కిషన్.. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వర్షాల కారణంగా అనేక జిల్లాలో ప్రజలు నష్టపోయారన్నారు. పంటలు, పశువుల, రోడ్లు కూడా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ బృందాలు వరద సహాయ కేంద్రాలలో తిరుగుతాయన్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. శనివారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్ర నాయకత్వం కలిసి వారికి తెలంగాణలో ఏర్పడిన వరద పరిస్థితులు వివరించిందన్నారు. త్వరలోనే కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని షా చెప్పినట్లు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. సోమవారం నాడు కేంద్ర బృందం తెలంగాణకు చేరుకుంటుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్‌ను కేంద్రం తీసుకుంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.