Share News

Kinnerasani: ‘కిన్నెరసాని’ జలాశయానికి వరదనీరు

ABN , First Publish Date - 2023-12-07T11:46:42+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్‌(Kinnerasani Reservoir)లో క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది.

Kinnerasani: ‘కిన్నెరసాని’ జలాశయానికి వరదనీరు

- 404.60 అడుగులకు చేరిన నీటిమట్టం

- రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

పాల్వంచ(కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్‌(Kinnerasani Reservoir)లో క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది. ఎగువతట్టు ప్రాంతాల్లోని మర్కోడు, ఆళ్లపల్లి, గుండాల తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా గత రెండు రోజులుగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతాల్లోని వాగులు వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలనుంచి అధికంగా ఉన్న నీరు లోతట్టు ప్రాంతమైన కిన్నెరసాని జలాశయానికి చేరుకుంటుంది. దీంతో బుధవారం సాయంత్రానికి రిజర్వాయర్‌ నీటిమట్టం 404.60 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 8000 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠ నీటిమట్టం 407 అడుగులు కావడంతో ఎటువంటి ఆందోళన పరిస్ధితులు లేవు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా రెండు గేట్ల ద్వారా అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ మోటర్లను సురక్షితమైన ప్రాంతాలకు తరలించుకోవాలని డ్యాం అధికారులు సూచించారు.

Updated Date - 2023-12-07T11:46:44+05:30 IST