గృహలక్ష్మి వచ్చేదెప్పుడో?

ABN , First Publish Date - 2023-03-26T00:55:42+05:30 IST

సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సర్కారు రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని నిరుపేదలు సొంతింటిపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ పథకం అమలు కోసం వారు నిరీక్షిస్తున్నారు.

గృహలక్ష్మి వచ్చేదెప్పుడో?

‘సొంత జాగాలో ఇల్లు’ పథకం కోసం నిరుపేదల ఎదురుచూపు

ఉమ్మడి జిల్లాలో 30వేల మందికి ప్రయోజనం

కలెక్టర్లకే పర్యవేక్షణ బాధ్యత? 8 విధివిధానాలపై కసరత్తు

ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 25: సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సర్కారు రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని నిరుపేదలు సొంతింటిపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ పథకం అమలు కోసం వారు నిరీక్షిస్తున్నారు. అయితే ఈ పథకం ప్రస్తుతం విధివిధానాల రూపకల్పన దశలోనే ఉంది. సర్కార్‌ జిల్లా కలెక్టర్లకే పథకం పర్యవేక్షణ బాధ్యతను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బబుల్‌బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లు సమర్థవంతంగా నిర్వహించడంతో గృహలక్ష్మి లబ్ధిదారులను కూడా ఎంపిక చేసేందుకు విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి కనీసం 3వేల ఇళ్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో ఎంపికైన లబ్ధిదారులకు మూడు విడతలుగా సొమ్మును వారి ఖాతాల్లో జమచేయనుంది. 10నియోజకవర్గాలకు 30వేల ఇళ్లు రానున్నాయి. దీనికోసం కనీసం రూ.1,000కోట్లు అవసరం ఉంటుందని అంచనా. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో రెండు పడకల ఇళ్లు 14,555 మంజూరు కాగా కేవలం 5,035 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను అందించారు. ఇంకా 5,454 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. అయితే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లపై లబ్ధిదారులు ప్రజలు తీరని అసంతృప్తితో ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదన్న అసంతృప్తి వెంటాడుతోంది. దీంతో ఈ పథకం ప్రజల్లో అంతగా విజయవంతం కాలేదు. దీంతో గృహలక్ష్మీ పథకం ద్వారా సొంత స్థలం ఉన్నవారికి రూ.3లక్షల నగదును ఇవ్వాలని యోచిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 2.64లక్షల మందికి పైగానే

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్రకుటుంబ సర్వే లెక్కల ప్రకారం సొంత జాగా ఉన్న వారు 2లక్షల 64,534 మంది ఉన్నారని తేలింది. అయితే ప్రస్తుతం రెండు జిల్లాలకు కలిపి 30వేల ఇళ్లు మాత్రమే మంజూరు కానున్నాయి. ఇవి కూడా ఏ మూలకు సరిపోయే ఆస్కారం కనిపించడం లేదు. గతంలో ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించిన హౌజింగ్‌ శాఖను రద్దు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖలకు గృహనిర్మాణాలను అప్పగించి పనులు చేయించారు. అయితే తాజాగా గృహలక్ష్మీ పథకం అమలును హౌజింగ్‌ శాఖ పరిశీలిస్తుందా లేక రెండు పడకల నిర్మాణాలు చేపట్టిన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పర్యవేక్షించాలా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

ఇరు జిల్లాల్లో ఇళ్లు కావాలంటూ, సొంత స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తున్న ప్రజావాణిలో అర్జీలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీనికితోడు ఇటీవల అధికార పార్టీ నేతలు కూడా ఆయా గ్రామాల్లో సొంత జాగా ఉన్నవారి వివరాలను కూడా సేకరించి ప్రభుత్వానికి పంపించారు. అవి కూడా పెద్దమొత్తంలోనే ఉన్నట్లు సమాచారం. ఒక్కో గ్రామంలో ఇల్లులేని పేదలు కనీసం 50నుంచి 500 మంది వరకు ఉన్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరు పడిన వారు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తే ఆస్కారం కనిపిస్తోంది.

విధివిధానాల అంచనా ఇలా..

ప్రస్తుతం డబుల్‌బెడ్‌ రూం ఇంటికి ఎంపిక చేసే లబ్ధిదారుల నుంచి వారి ఆధార్‌ కారు బ్యాంకు పాసు పుస్తకం సేకరిస్తున్నారు. ఆనలైనలో ఎంపికైన లబ్ధిదారుని వివరాలను ఆధార్‌ కార్డు ఆధారంగా పొందుపరుస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇంటిని పొందిన వారి వివరాల ఆధారంగా కూడా వారిని తిరస్కరించేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొం

దించారు. ఒక్కసారి ఆధార్‌నెంబర్‌ ఆధారంగా లబ్దిదారుని వివరాలు నమోదు చేస్తే గతంలో ఇల్లు పొందారా.. స్థలం పొందారా.. అనే విషయాలు వెల్లడవుతాయి. దాని ఆధారంగానే కొత్తగా వాస్తవ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం గృహలక్ష్మి లబ్ధిదారులకు కూడా ఇదే విధానాన్ని అమలుచేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ యోచిస్తున్నట్లు సమాచారం. సొంత జాగా ఉన్న వారి వివరాలు సేకరించిన తర్వాత దరఖాస్తులను ఆనలైనలో స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గతంలో ఏమైనా లబ్దిపొందారా ? అనే విషయాన్ని ఆనలైనలోనే పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో మరోమారు జాగాను, లబ్ధిదారులను పరిశీలిస్తారు. ఆ తర్వాతనే ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే ఈ ప్రక్రియను కొనసాగించేందుకు అధికారులు సన్నద్దం అవుతున్నారు.

మార్గదర్శకాలు రావాల్సి ఉంది

శిరీష, జిల్లా రెవెన్యూ అధికారి

గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లుగానే ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌లో గృహలక్ష్మీ లబ్ధిదారుల ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇళ్లు కేటాయించారు. సొంత జాగా ఉన్న వారి దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ఉంటుంది. గతంలో ఏ పథకంలోనూ లబ్దిపొందని వారికి మాత్రమే ఈ పథకంకి ఎంపిక చేయనున్నాం. దీనికోసం కలెక్టర్‌ పర్యవేక్షణలో అధికారులు సిద్ధంగా ఉన్నాం.

2014 సమగ్ర కుటుంబ సర్వేలో ఉమ్మడి జిల్లా వివరాలిలా

మొత్తం కుటుంబాలు : 8,31,020

పూరిగుడిశల్లో ఉంటున్నవారు : 41,362

సొంత ఇళ్లు ఉన్నవారు : 1,87,472

అద్దెఇళ్లలో ఉంటున్నవారు : 1,97,307

సొంత జాగా ఉన్న వారు : 2,64,534

ఎలాంటి స్థలం లేని వారు : 5,64,734

Updated Date - 2023-03-26T00:55:42+05:30 IST