కల్యాణం కమనీయం

ABN , First Publish Date - 2023-03-30T23:43:16+05:30 IST

శ్రీరామనవమి సందర్భంగా గురువారం భద్రగిరిలో గోదావరి తీరాన సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయంగా సాగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ దశరధుడి కుమారుడు శ్రీరామచంద్రుడు, జనకుడి కుమార్తె సీతమ్మ మెడలో తాళికట్టాడు. సీతమ్మవారు జన్మించిన శోభకృత నామ సంవత్సర నవమి పర్వదినాన నిర్వహించిన ఈ కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు భద్రాచలానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

కల్యాణం కమనీయం
మాంగల్యధారణ గావిస్తున్న అర్చకులు

DSC_4066.jpgపట్టువస్త్రాలు తీసుకొస్తున్న దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు

bdr-rama-4.jpgముత్యాల తలంబ్రాలకు నమస్కరిస్తున్న బండారు దత్తాత్రేయ

A7402943.jpgమంగళసూత్రాలను చూపుతున్న అర్చకుడు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల పరిణయం

పట్టువసా్త్రలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

తిలకించిన హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, చినజీయర్‌స్వామి

భద్రాచలం, మార్చి 30: శ్రీరామనవమి సందర్భంగా గురువారం భద్రగిరిలో గోదావరి తీరాన సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయంగా సాగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ దశరధుడి కుమారుడు శ్రీరామచంద్రుడు, జనకుడి కుమార్తె సీతమ్మ మెడలో తాళికట్టాడు. సీతమ్మవారు జన్మించిన శోభకృత నామ సంవత్సర నవమి పర్వదినాన నిర్వహించిన ఈ కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు భద్రాచలానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణంలో దశరథుడు, జనకుడితోపాటు భక్తుల తరపున భక్తరామదాసు చేయించిన మూడు సూత్రాలతో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో భద్రాచలం పురవీధులు జనసంద్రంగా మారాయి. తెల్లవారుజామున రెండుగంటలకే ఆలయాన్ని తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళశాసనం, అభిషేకం చేశారు. అనంతరం ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఈ తంతుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఉదయం 9:30గంటలకు కల్యాణమూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ముందుగా తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. అనంతరం ప్రత్యేక మంత్రాన్ని జపిస్తూ వేద పండితులు సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మను కూర్చొబెట్టి కన్యావరణలు జరిపారు. రక్షబంఽధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరిపారు. యోక్త్రబంధనం, వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు ప్రవచించారు. ఈ సమయంలో ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పోదక స్నానం జరిపి వరపూజ నిర్వహించారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకుపతకం, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణస్వామికి ధరింపచేయడంతో మరింత శోభ చేకూరింది. అనంతరం ప్రజలపక్షాన, రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి పట్టువసా్త్రలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే వ్యక్తిగతంగా సైతం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువసా్త్రలు సమర్పించారు. అనంతరం శ్రీరంగం, తిరుమల తిరుపతి, శృంగేరి పీఠం, చినజీయర్‌స్వామి, భక్తరామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాసరావు స్వామివారికి పట్టువసా్త్రలు సమర్పించారు. భద్రాద్రి రాముని కల్యాణ వైభవ ప్రాశస్త్యంతోపాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి, అదర్వ వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు వివరించారు. అర్చక స్వాములు మఽధుపర్క ప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నివేదించి నూతన వస్ర్తాలంకరణ చేశారు. లోక పర్యంతాన్ని, విశ్వసృష్టిని దానిలో ఉన్న కాలాన్ని, దేశాన్ని తెలుపుతూ సంకల్పంచెప్పి ‘కన్యాదాన కరిష్యే’.. అంటూ ముగించారు. ఈ సమయంలో కన్యావరణలు, కొబ్బరి బోండం, తాంబూలం, దక్షిణ స్వామివారికి సమర్పించారు. కన్యాదానంతోపాటు గోదానం, భూదాన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రామ భద్రుడికి సీతామాతకు వేర్వేరుగా మంగళాష్టకం చదివారు. సరిగ్గా 12గంటలకు అభిజితలగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని విశిష్టత వివరిస్తూ ఉత్సవమూర్తుల శిరస్సుపై ఉంచారు. అనంతరం దశరుదుడు, జనకమహారాజు తరపున, భక్తుల తరపున భక్తరామదాసు చేయించిన మూడు మంగళ సూత్రాలతో సూత్రధారణ కన్నుల పండువగా నిర్వహించారు. ఆ తరువాత తలంబ్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తలంబ్రాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చివరగా భాగవోత్తముల ఆశీర్వచనంతో కల్యాణం ముగిసింది. కాగా ఒక వైపు ఎండ వేడిమి, మరోవైపు కనీస మౌలిక వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కల్యాణాన్ని తిలకించిన హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ

సీతారాముల కల్యాణాన్ని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తిలకించారు. ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఏపీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి, జిల్లా కోర్టు పోర్టుపోలియో జడ్జి శ్రీదేవి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డా.వినీతలు కల్యాణాన్ని తిలకించారు.

శ్రీరామపునర్వసు దీక్ష ప్రారంభం

భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామ పునర్వసు దీక్షలో భాగంగా భక్తులు గురువారం రాత్రి శ్రీరామ పునర్వసు దీక్షను స్వీకరించారు. ఏటా శ్రీరామనవమి రోజున పునర్వసు దీక్షను స్వీకరించడం ఇక్కడి సంప్రదాయం. 27 రోజుల అనంతరం ఈ దీక్ష విరమణ ఉంటుం ది. స్థానిక రామాలయ ప్రాంగణంలో అర్చకుల సమక్షంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పునర్వసు దీక్షను స్వీకరించారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి కల్యాణ రాముడికి చంద్రప్రభ వాహనంపై తిరువీధిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తీర్థపసాదాలు స్వీకరించారు.

నేడు శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం

పట్టువసా్త్రలు సమర్పించనున్న గవర్నర్‌ తమిళిసై

12ఏళ్లకోసారి జరిగే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని భద్రాచలంలో శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై హాజరై పట్టువసా్త్రలు సమర్పించనున్నారు. కల్యాణం అనంతరం ఒక్క శ్రీ సీతారామచంద్రమూర్తికి తప్ప మరే ఇతర దైవానికి నిర్వహించని విలక్షణమైన ఉత్సవం పట్టాభిషేకం. ఇది భద్రాచల రామయ్యకు మాత్రమే దక్కే గౌరవం.. నిత్యం జరిగే శ్రీరామ పారాయణానికి అనుగుణంగా ప్రతినెల పుష్యమిరోజు జరిగే దాన్ని శ్రీరామ పట్టాభిషేకం గాను, ప్రతిఏటా శ్రీ సీతారాముల కల్యాణం మరుసటిరోజు జరిగే దాన్ని శ్రీరామ మహా పట్టాభిషేకంగా పేర్కొంటారు. ప్రతి ప్రభవ నామ సంవత్సరంలో 60సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకంగా నిర్వహించటం ఈ క్షేత్ర సంప్రదాయం. ఇందులో భాగంగా 1927, 1987లో మహా సామ్రాజ్య పట్టాభిషేకాలు నిర్వహించారు. ఈ సమయంలో భక్తుల సౌకర్యార్దం ఇందులో మార్పులు చేస్తూ పుష్కరంలో (12 సంవత్సరాలు) పట్టాభిషేకం నిర్వహించాలని నిర్ణయించి 1999లో తొలిసారి సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నిర్వహించారు. రెండోసారి 2011లో నిర్వహించగా, మళ్లీ శుక్రవారం శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాముడికి సంబంధించిన ఆభరణాలతోపాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు. ఈ పట్టాభిషేకానికి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణ మండపంలో విస్తృత బందోబస్తు సిద్ధం చేశారు.

గవర్నర్‌ పర్యటన ఇలా..

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై గురువారం రాత్రి 11.45 గంటలకు ప్రత్యేక రైలులో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 4:15గంటలకు కొత్తగూడెం రైల్వేస్టేషన (భద్రాచలంరోడ్‌)కు చేరుకుంటారు. అక్కడినుంచి భద్రాచలంలోని సారపాక ఐటీసీ గెస్ట్‌హౌ్‌సకు 4.50 గంటలకు చేరుకుంటారు. ఉదయం 9.40గంటలకు రోడ్డుమార్గంలో భద్రాద్రి దేవస్థానానికి చేరుకుంటారు. 10గంటల నుంచి 12.30గంటల వరకు శ్రీరామ సామ్రాజ్యపుష్కర పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టువసా్త్రలు సమర్పిస్తారు. మ ధ్యాహ్నం భోజనం అనంతరం సాయంత్రం 3గంటలకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి 3.45గంటలకు దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు చేరుకుంటారు. 5గంటల వరకు పర్ణశాలను సందర్శిస్తారు. సారపాక గెస్ట్‌హౌ్‌సలో రాత్రి భోజనం చేసి 10.15కు కొత్తగూడెం రైల్వేస్టేషనకు చేరుకుని అక్కడ 10.30గంటలకు రైలు ఎక్కి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - 2023-03-30T23:43:16+05:30 IST