Share News

నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:12 AM

సింగరేణి 138వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వంసిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు సహా ప్రధాన కార్యాలయం ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోనూ ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ ఏరియాల్లో సంస్థకు ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేసి వారికి అవార్డులను అందజేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులను కేటాయించారు. సింగరేణి

నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

11ఏరియాల్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు

రుద్రంపూర్‌, (సింగరేణి) డిసెంబరు 22 : సింగరేణి 138వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వంసిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు సహా ప్రధాన కార్యాలయం ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోనూ ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ ఏరియాల్లో సంస్థకు ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేసి వారికి అవార్డులను అందజేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులను కేటాయించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెంలోని ప్రకాశంస్టేడియంలో ప్రధాన ఉత్సవాలను నిర్వహించేందుకు గాను వారం రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు.. సంస్థలోని కీలక విభాగాలైన భూగర్భబావులు, ఓపెనకాస్టులు, బొగ్గు నిక్షేపాల అన్వేషణ తదితర విభాగాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. అలాగే సింగరేణియులకు వినోదాన్ని అందించేందుకు సినీ, టీవీ ఆర్టిస్టులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సంస్థకు ఉత్తమ సేవలు అందించిన కార్మికులను, కార్మిక కుటుంబసభ్యులు సన్మానించేలా ఏర్పాట్లు చేశారు. ప్రకాశంస్టేడియం, సింగరేణి ప్రధాన కార్యాలయం, సింగరేణి ప్రధాన ఆసుపత్రి, పలు డిపార్టుమెంట్ల కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

ఈ సారైనా సీఎండీ వచ్చేనా..?

కొత్తగూడెంలోని సింగరేణి ప్రకాశం స్టేడియంలో జరిగే ఆవిర్భావ వేడుకలకు సింగరేణి సీఎండీ ఎన.శ్రీధర్‌ మూడేళ్లుగా హజరుకావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగతున్న ఈ వేడుకలకైనా ఆయన హాజరవుతారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. అయితే సింగరేణి వేడుకలకు సంబంధించి నిర్వహించే కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారే తప్ప.. సీఎండీ, డైరెక్టర్‌ (పా)తోపాటు ఇతర అధికారులు ఎవరొస్తారనేది ప్రకటించకపోవడం గమనార్హం. సింగరేణిలో ఈ నెల 27వ తేదీన సింగరేణి గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జరిగే ఆవిర్భావ వేడుకలకు ప్రాధాన్యమిస్తారా? మంత్రులు, శాసనసభ్యులు హజరవుతారా.. లేదా అనేది ప్రకటించడం లేదు. దీంతో ఆవిర్భావ వేడుకలను స్థానిక అధికారులే మ.. మ.. అనే రీతిలో నిర్వహించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంతో ఖర్చు చేస్తూ నిర్వహించే ఈ వేడుకలను ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తోన్నారు. సింగరేణిలో నూతన ప్రాజెక్టుల ఏర్పాటు, సంస్థ అభివృద్ధి తదితర అంశాలను వివరించాల్సిన ఉన్నతాధికారులు ఉత్సవాలకు హజరుకాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 07:09 AM