Share News

కడుపులోనే చిదిమేస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-17T01:01:24+05:30 IST

‘పైసలిస్తే చాలు పుట్టబోయే బిడ్డ ఆడా మగా అని చెప్పేస్తున్నారు.. కాసుల కక్కుర్తిలో కొందరు వైద్యసిబ్బంది లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడపిల్ల అయితే కడుపులోనే చిదిమేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు వైద్య సిబ్బంది చాటుమాటుగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు.

కడుపులోనే చిదిమేస్తున్నారు

ఖమ్మంలో మళ్లీ మొదలైన లింగ నిర్థారణ పరీక్షలు

మొబైల్‌ స్కానింగ్‌ యంత్రాలతో ఇళ్ల వద్దకే సర్వీస్‌

ఆడపిల్లని తేలితే చాటుమాటుగా అబార్షన్లు

ఒక్కో గర్భవిచ్ఛిత్తికి రూ.20వేలు వసూలు

ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 16: ‘పైసలిస్తే చాలు పుట్టబోయే బిడ్డ ఆడా మగా అని చెప్పేస్తున్నారు.. కాసుల కక్కుర్తిలో కొందరు వైద్యసిబ్బంది లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడపిల్ల అయితే కడుపులోనే చిదిమేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు వైద్య సిబ్బంది చాటుమాటుగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ఏడాది క్రితం ఖమ్మంలో జిల్లా వైద్యాధికారులు ఓ ప్రైవేటు ఆసుపత్రిపై దాడులు నిర్వహించి సీజ్‌ చేయడంతో కొంతకాలం ఈ దందాకు అడ్డుకట్ట పడింది. కానీ కొద్దిరోజులుగా మళ్లీ ఖమ్మంలో ఈ దందా కొనసాగుతోంది. చాటుమాటుగా ఇళ్లల్లోనే మొబైల్‌ స్కానింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసుకుని లింగ నిర్థారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు. దీనికి కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల యజమాన్యాలు సహకరిస్తున్నాయి. ఆసుపత్రికి రోగి వస్తే అనవసరమైన పరీక్షలు చేసి, అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తూ లక్షలు వసూలు చేసే కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు చివరకు బరి తెగించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తున్నాయి. ఒక్కో ఆబార్షనకు రూ.16వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. చివరకు ఆబార్షన చేయలేని పరిస్థితి ఉంటే పుట్టిన ఆడపిల్లను తామే విక్రయిస్తామని నిస్సిగ్గుగా చేప్పే కొందరు వైద్యులు కూడా ఇక్కడ ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో ప్రతి సంవత్సరం 50 వేల కాన్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు తమకు పుట్టబోయేది ఆడా మగా అని లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఆబార్షన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం నగరంలోని వైరారోడ్డులో ఓ చర్చి ఎదురు సందులో ఉన్న ఓ ఆసుపత్రిలో స్కానింగ్‌తో పాటు అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఖమ్మంలోని కొందరు వ్యక్తులు మొబైల్‌ స్కానింగ్‌ కేంద్రాలతో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్ల క్రితం ఖమ్మం నగరంలోని మయూరిసెంటర్‌లో ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తూ పట్టుబడిన నిందితులతో పాటు మరికొంత మందిని జమచేసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

నామ మాత్రంగానే తనిఖీలు

స్కానింగ్‌ కేంద్రాల్లో డెకాయి ఆపరేషన పేరిట వైద్యశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి. కానీ జిల్లాలో ఎక్కడా అవి చేసిన దాఖలాలు లేవు. జిల్లాలోని ఏ ఆసుపత్రి, స్కానింగ్‌ సెంటర్లలో నిబందనలు పాటించకపోయినా వైద్యాధికారులు మిన్నకుంటుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తనిఖీల సమాచారం కూడా ముందుగానే కేంద్రాల నిర్వాహకులకు తెలుస్తుండడంతో అక్రమార్కులు అంతా సర్దుకుంటున్నారు.

రేడియాలజీ నిపుణుల కొరత

ఖమ్మం నగరంలో కొందరు కనీస ప్రమాణాలు పాటించకుండా స్కానింగ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అతి తక్కువ మంది రేడియాలజిస్టులు ఉన్నారు. ప్రభుత్వం గైనకాలజిస్టులకు ఇచ్చిన సడలింపుల కారణంగా జిల్లాలో అన్ని ప్రైవేటు నర్సింగ్‌ హోంలలో స్కానింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిబంధనల మేరకు స్కానింగ్‌ నివేదికలను రేడియాలజిస్టులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయితే అనేక స్కానింగ్‌ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. ఒక్కో కేంద్రంలో రెండు మిషన్లు పెట్టి ఒకే రేడియాలజిస్టుతో స్కానింగ్‌లు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇరుకు గదుల్లో.. కనీసం గాలి వెలుతురు కూడా లేని గదుల్లో స్కానింగ్‌ కేంద్రాలు నిర్వహిస్తూ మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వాటిపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులు మాత్రం పని ఒత్తిడితో మిన్నకుంటున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో గైనకాలజిస్టులే స్కానింగ్‌ నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్టులు స్కానింగ్‌ చేయడానికి పీసీపీఎనడీటీ చట్టం ప్రకారం ప్రత్యేక కోర్సు చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అలాంటి కోర్సు చేయకుండానే స్కానింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-10-17T01:01:24+05:30 IST