భక్తిశ్రద్ధలతో శ్రీరామాయణ మహాక్రతువు

ABN , First Publish Date - 2023-03-26T00:58:52+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా శ్రీరామాయణ మహాక్రతువును భక్తిప్రపత్తులతో నిర్వహిస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో శ్రీరామాయణ మహాక్రతువు
శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్న దృశ్యం

09kmm25bcm-temple.jpgమిథిలాస్టేడియంలో సెక్టార్ల నిర్వహణపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

భద్రాచలంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు

భద్రాచలం మార్చి 25: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా శ్రీరామాయణ మహాక్రతువును భక్తిప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 22న క్రతువుకు అంకురార్పణ చేయగా 23నుంచి పుష్కర యాగశాలలో చతుర్వేద హవనాలు, శ్రీరామాయణ హవనం, శ్రీరామ షడాక్షరి, నారాయణ అష్టాక్షరి మంత్ర హోమాలు, సంక్షేప రామాయణ సామూహిక పారాయణం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విష్ణుసహస్ర నామస్తోత్ర సామూహిక పారాయణం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు. శ్రీరామాయణ మహాక్రతవులో అంతర్భాగంగా ఇష్టి యాగశాల వద్ద శనివారం శ్రీ నృసింహేష్టి హోమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఆదివారం శ్రీ సుదర్శనేష్టి హోమాన్ని నిర్వహించనున్నారు.

నవమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

భద్రాద్రి నవమి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కలెక్టరు అనుదీప్‌ శనివారం సాయంత్రం పరిశీలించారు. మిథిలాస్టేడియం, రామాలయ ప్రాంగణం, రామాలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టార్లలో భక్తులకు ఇబ్బందిరాకుండా ప్రత్యేకంగా జిల్లాస్థాయి అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ వేడుకను భక్తులు వీక్షించేందుకు ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలన్నారు.శ్రీరామ నవమి రోజున సెక్టార్‌ అధికారులు ఉదయం 5గంటలకే చేరుకోవాలని సూచించారు. భక్తులు సెక్టార్లోకి వచ్చినప్పటినుంచి తిరిగి బయటకు వెళ్లేవరకు ప్రత్యేక అధికారులదే బాధ్యత అన్నారు. భక్తుల సౌకర్యార్థం 70తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోటళ్లలో ఆహార పదార్థాలకు ధరలు నిర్ణయించి బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో 08743-232444 నెంబరుతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టరు వెంకటేశ్వర్లు, ఏఎ్‌సపీ పరితోష్‌ పంకజ్‌, డీపీవో రమాకాంత, ఆర్డీవో రత్నకల్యాణి, దేవస్థానం ఈవో ఎల్‌.రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:58:52+05:30 IST