ఆరు పథకాలు.. ఆరు అస్త్రాలు
ABN , First Publish Date - 2023-09-19T23:41:48+05:30 IST
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారపర్వంలోకి దిగింది. హైదరాబాద్ విజయభేరి సభ వేదికగా సోనియాగాంధీ నేతృత్వంలో ఆరు సంక్షేమ పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే వీటిని పక్కాగా అమలు చేసి తీరుతామంటూ ఆ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి

ప్రచారపర్వంలోకి కాంగ్రెస్ నేతలు
ఖమ్మం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారపర్వంలోకి దిగింది. హైదరాబాద్ విజయభేరి సభ వేదికగా సోనియాగాంధీ నేతృత్వంలో ఆరు సంక్షేమ పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే వీటిని పక్కాగా అమలు చేసి తీరుతామంటూ ఆ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఆరో పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఆ కార్డుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2500, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతుభరోసా కింద రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయకూలీలకు రూ.12వేలు, వరిపంటకు రూ.500బోనస్, గృహజ్యోతి పథకం కింద ప్రతీ కుటుంబానికి 200యూనిట్లు ఉచిత విద్యుత, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లులేని వారికి ఇంటిస్థలం, రూ.5లక్షలు ఇంటి నిర్మాణానికి సహాయం, ఉద్యమ కారులకు 250గజాల ఇంటిస్థలం, యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5లక్షలు, విద్యాభరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌స్కూళ్లు, చేయూత కింద నెలకు రూ.4వేల పింఛన, రాజీవ్ ఆరోగ్యశ్రీభీమా రూ.10లక్షలు ఇలా పథకాల వివరాలను ముంద్రించారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ నుంచి కూడా ప్రతినిధులు జిల్లాలో పలు నియోజకవర్గాలకు వచ్చి కాంగ్రెస్ కేడర్‌తో కలిసి కార్డుల పంపిణీ సాగిస్తున్నారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే కర్నాటకలో అమలవుతున్న ఈ పథకాలు తెలంగాణలో కూడా అమలుచేస్తామని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చింతకాని మండలం నాగులవంచలో ఈ కార్డులను ఇంటింటికి అందించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక రఘునాథపాలెం మండలంలో ఏఐసీసీ ప్రతినిధి అవినాష్‌పాండే, వి.హనుమంతరావు, మహ్మద్‌జావీద్ పాల్గొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఆలిండియా కాంగ్రెస్ నుంచి ఒకరు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నుంచి ఒకరు ఇనచార్జ్‌లుగా నియమించడంతో వారే ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలకు కూడా అక్కడ ఆశావహులు గడపగడపకు కాంగ్రెస్ పేరుతో హామీ కార్డులను అందజేస్తుండటంతో కాంగ్రెస్ కేడర్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేలా మోదీ, అమితషా చర్యలు చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పాత్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బోనకల్/చింతకాని, సెప్టెంబరు 19: దేశంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేలా మోదీ, అమితషా చర్యలుంటున్నాయని, రాహుల్ గాంధీపై కూడా అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరించారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ఆయన బోనకల్ మండలం కేంద్రంలో విలేకరుల సమావేశం, చింతకాని మండలం నాగులవంచలో కాంగ్రెస్ సంక్షేమ పథకాల గ్యారంటీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు ప్రజలకోసమే పని చేస్తాయని, కానీ ఇటీవల ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులకు కేంద్ర పెద్దలు ఊతమిస్తున్నారని, ఏపీలో కూడా కేంద్ర పాలకుల పాత్రతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని, జగన భుజాలపై తుపాకీ పెట్టి కాల్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. స్వరాష్ట్రం వచ్చి పదేళ్లయినా బీఆర్‌ఎస్ పాలనలో పేదల బతుకులు మారలేదన్నారు. పేదల బతుకులు బాగుపడాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర చేశానని గుర్తుచేశారు.