‘గులాబీ’ నీడన.. ఇసుక మాఫియా!

ABN , First Publish Date - 2023-10-03T00:19:58+05:30 IST

వర్షాలు తగ్గడం, భవన నిర్మాణ పనులు ఊపందుకోవడంతో ఉమ్మడి జిల్లాలో ఇసుక వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదనుగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అటు గోదావరి.. ఇటు కృష్ణాతోపాటు మున్నేరు లాంటి వనరుల నుంచి యథ్ఛేగా రవాణా అవుతోంది. రూ.కోట్లలో సాగుతున్న ఈ ఇసుక వ్యాపారం ‘గులాబీ’ నీడన సాగుతోందని, ఇందులో కొందరు అధికారపార్టీ

‘గులాబీ’ నీడన.. ఇసుక మాఫియా!

ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో సాగుతున్న దందా

పట్టుకోవాలంటే భయపడుతున్న అధికారులు

ఖమ్మం,అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : వర్షాలు తగ్గడం, భవన నిర్మాణ పనులు ఊపందుకోవడంతో ఉమ్మడి జిల్లాలో ఇసుక వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదనుగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అటు గోదావరి.. ఇటు కృష్ణాతోపాటు మున్నేరు లాంటి వనరుల నుంచి యథ్ఛేగా రవాణా అవుతోంది. రూ.కోట్లలో సాగుతున్న ఈ ఇసుక వ్యాపారం ‘గులాబీ’ నీడన సాగుతోందని, ఇందులో కొందరు అధికారపార్టీ నాయకులే క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇసుక తరలించే వాహనాలను పట్టుకునేందుకు అధికారులు కూడా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఒక వేళ ఎక్కడైనా పట్టుకుంటే వెంటనే గులాబీ లీడర్లనుంచి ఫోన్లు వస్తుండటంతో చర్యలేమీ తీసుకోకుండానే వదిలేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీఎస్‌ఎండీసీ ప్రేక్షకపాత్రే వహిస్తోందని, సిబ్బంది లేరంటూ ఆ శాఖ సాకులు చెబుతుండగా, రెవెన్యూ, పోలీసు అధికారులేమో తమ కెందుకులే అని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇసుక దందా ‘మూడుపువ్వులు.. ఆరుకాయలు’ చందంగా సాగుతోందని, లారీ అసోసియేషన్ల ముసుగులో కొందరు అధికార పార్టీ నాయకులు... మరికొందరు లారీ అసోసియేషన్‌ నాయకులతో సిండికేట్‌గా మారి ఇసుకవ్యాపారం నడిపిస్తున్నారన్నది బహిరంగ సత్యమే. టీఎస్‌ఎండీసీ నుంచి పొందని ఒక బిల్లుతోనే అనేక లారీలు తరలుతూ.. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కూడా లేకుండా నేరుగా హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి, కృష్ణాతో పాటు పలు వనరుల నుంచి తరలిస్తున్న లారీ ఇసుకను హైదరాబాద్‌లో రూ.50వేల నుంచి రూ.60వేలపైగా విక్రయిస్తున్నారు సగానికి సగం రాబడి ఉండడంతో వ్యాపారులు తమ దందాకు సహకరిస్తున్న గులాబీ లీడర్లకు కూడా పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడ ఇసుక ర్యాంపులుంటే అక్కడ తెరవెనుక గులాబీ లీడర్లు ఇసుక దందాలో చక్రం తిప్పుతుండటంతో.. ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల రాయల్టీకి కన్నం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గోదావరి నుంచి ఇలా..

గోదావరి పరివాహక ప్రాంతమైన మణుగూరు, పినపాక, అశ్వాపురం చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో ఇసుక రేవులున్నాయి. గిరిజన సొసైటీల పేరుతో అనుమతులు పొంది మొత్తం కాంట్రాక్టర్లే ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఈ దందా కొందరు గులాబీ లీడర్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. భద్రాచలం సమీపంలోని ఏపీ మన్యం జిల్లా కొల్లుగూడెం, గుండాల వద్ద కూడా ఇసుక ర్యాంపుల ద్వారా తవ్వి అదే ఇసుకను ఏపీ వేబిల్లుల పేరుతో తరలిస్తున్నారు. అక్కడ వైపీసీ.. ఇక్కడ బీఆర్‌ఎస్‌లోని సరిహద్దు ప్రాంతాల నాయకులు కాసులు పంచుకుంటున్నారు. చర్ల మండలంలో మూడుక్వారీలు, దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక ఇసుక క్వారీ, మణుగూరు మండలం పద్మగూడెం, బూర్గంపాడు మండలంలోని పాతగొమ్మూరు, పినపాక మండలంలోని మూడు ర్యాంపులు నుంచి రోజు 300పైగా లారీల్లో ఇసుక హైదరాబాదు తరలిపోతోంది. ఇందులో టీఎస్‌ఎండీసీ వేబిల్లులతో కొన్ని పోతుంటే.. ఆ వేబిల్లుపైనే దొంగలారీలు కూడా తరలుతున్నాయి. ఇలా టీఎస్‌ఎండీసీకి రాయల్టీ చెల్లించకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లు, కొందరు లారీ యజమానులు సొమ్ములు చేసుకుంటున్నారు. గిరిజన సొసైటీలున్నా వారి పాత్రకంటే గులాబీ లీడర్లు, లారీ యజమానుల పాత్ర కీలకంగా మారడంతో.. ఉన్నతాధికారులు ప్రేకక్షకపాత్ర వహిస్తున్నారు.

కృష్ణా నది, మున్నేరు తదితర వనరుల నుంచి ఇలా..

కృష్ణానది జిల్లాకు సరిహద్దున.. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలో ఉండటంతో.. బోనకల్‌, ముదిగొండ తదితర మండలాల మీదుగా కృష్ణా నది ఇసుకను ఖమ్మానికి తరలిస్తున్నారు. లారీల ద్వారా అక్కడి వైసీపీ నాయకుల సహకారంతో ఇక్కడ గులాబీ లీడర్లు, లారీలు అధికంగా ఉన్న యజమాని ఒకరు కనుసన్నల్లో ఇసక దందా నడుస్తోంది. మున్నేరులోని చిన్నమండవ, పెద్దమండవ, ఖమ్మంరరల్‌, ముదిగొండ చింతకాని, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం మండలాలకు చెందిన కొందరు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా కూడా ఇసుకను ఖమ్మంలో ప్రైవేటు డిపోలు పెట్టి విక్రయిస్తున్నారు. కొందరు గోదావరి ఇసుక పేరుతో కృష్ణా ఇసుకపేరుతో, మున్నేరు ఇసుకపేరుతో ఖమ్మం కరుణగిరి, బైపాస్‌రోడ్‌ తదితర చోట్ల అనధికారిక డిపోలు పెట్టి ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. టీఎస్‌ఎండీసీ అనుమతులున్నాయని దొంగ బిల్లులతో దందా నడిపిస్తున్నారు. అటు ట్రాక్టర్ల, ఇటు లారీలనుంచి ఇసుక అక్రమరవాణాతో రూ.కోట్ల ఆదాయానికి గండి పడి ప్రైవేటు వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తూ ఇసుక వ్యాపారం బంగార వ్యాపారంకంటే బాగుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీకి ఇటీవల టీఎస్‌ఎండీసీకి చెందిన సిబ్బంది ముదిగొండ మండలంలోని ఏపీకి సరిహద్దు గ్రామం వద్ద కృష్ణానది నుంచి ఇసుక తెస్తున్న లారీలను పట్టుకోవడంతో వెంటనే అక్కడికి అధికార బీఆర్‌ఎస్‌ లీడర్లు ప్రత్యక్షమై టీఎస్‌ఎండీసీ అదికారులు, సిబ్బందిని కొట్టేందుకు సిద్ధమయ్యారు. దుర్భాషలాడి లారీలు పట్టుకెళ్లేందుకు ప్రయత్నించినా అక్కడ లారీలపై కేసులు నమోదుచేసి రూ.50వేలు ఫైన వేశారు. ఆరునెలల క్రితం బోనకల్‌ మండలంలో పెద్దఎత్తున ఖమ్మం వస్తున్న కృష్ణా నది ఇసుక లారీలను బీజేపీ నాయకుల అడ్డుకుని ఆందోళన చేశారు. అక్కడ కొన్ని లారీలను పట్టుకుని కేసులు లేకుండానే లారీలను పంపించారు. దీని వెనుక గులాబీ లీడర్లనుంచి ఫోన్లు రావడంతో మైనింగ్‌ అధికారులు కేసులు పెట్టకుండానే లారీలను వదిలేశారు. ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌, టీఎస్‌ఎండీసీ, రవాణశాఖ అధికారులు ఇసుక అక్రమ వ్యాపారం పెద్దఎత్తున నడుస్తున్నా రూ.కోట్లు ప్రభుత్వ ఖజానాకు కన్నం పడుతున్నా ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తోంది. గులాబీ లీడర్లు చోటామోటానుంచి బడాస్థాయివరకు అండదండలు ఉండడంతో కొందరు లారీల యజమానులు ఇసుక కాంట్రాక్టర్లు, చోటామోటా నాయకులు ఇసుక దందాను జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమరవాణపై కొరడా ఝుళిపించకపోతే గంజాయి మాఫియాలా ఇసుక మాఫియా మరింత విస్తరించే అవకాశం ఉంది.

Updated Date - 2023-10-03T00:20:05+05:30 IST