ఖమ్మం-విజయవాడ గ్రీనఫీల్డ్‌ హైవేకు మోక్షం

ABN , First Publish Date - 2023-03-16T01:54:55+05:30 IST

మహారాష్ట్ర-తెలంగాణ- ఏపీని అనుసంధానం చేసే నాగపూర్‌-అమరావతి 163(జి) గ్రీనఫీల్డ్‌ హైవే నాలుగు వరసల రహదారి పనులకు మోక్షం లభించబోతోంది.

ఖమ్మం-విజయవాడ గ్రీనఫీల్డ్‌ హైవేకు మోక్షం

మొదటి ప్యాకేజీకి నిధుల మంజూరుతో పనులు ప్రారంభమయ్యే అవకాశం

ఖమ్మం, మార్చి 15 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : మహారాష్ట్ర-తెలంగాణ- ఏపీని అనుసంధానం చేసే నాగపూర్‌-అమరావతి 163(జి) గ్రీనఫీల్డ్‌ హైవే నాలుగు వరసల రహదారి పనులకు మోక్షం లభించబోతోంది. ఇప్పటి వరకు భూసేకరణ జరిగిన ప్రాంతంలో పనులు చేపట్టేందుకు నేషనల్‌ హైవే అథారిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితినగడ్కరీ ఖమ్మంలోని వీ.వెంకటాయపాలెం నుండి బోనకల్‌ మండలం బ్రాహ్మణపల్లి వరకు మొదటి ప్యాకేజీ కింద 29.92కిమీ రహదారి నిర్మాణానికి రూ.983 కోట్లు మంజూరు చేయడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. సూర్యాపేట-దేవరపల్లి గ్రీనఫీల్డ్‌ నాలుగులైన్ల రహదారి పనుల ప్యాకేజీల్లో కొన్నిచోట్ల ప్రాథమిక పనులు చేపడుతున్నందున తొలుత ఖమ్మంనుంచి విజయవాడ మార్గంలో నాలుగు లైన్ల రహదారికి దశలవారీగా పనులు చేపట్టబోతున్నారు. నాగ్‌పూర్‌-అమరావతి, సూర్యాపేట-దేవరపల్లి నాలుగు లైన్ల రహదారులు కూడా ఖమ్మం సమీపంలోనే అనుసంధానం అవుతున్నందున ముందుగా ఈప్యాకేజీ పనులు పూర్తిచేసి విజయవాడ వైపు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేస్తోంది. ఖమ్మంరూరల్‌ మండలం మంగలగూడెంనుంచి ఖమ్మంజిల్లాలో నాగ్‌పూర్‌-అమరావతి నేషనల్‌ హైవే పనులు మొదలవుతాయి. ఖమ్మంరూరల్‌, రఘునాథపాలెం, చింతకాని, బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం మీదుగా రేమిడిచర్ల వద్ద ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలో కలిసి.. నున్న వద్ద కోల్‌కతా రహదారికి కలుస్తుంది. మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం తదితర పోర్టులకు ఈ రహదారి అనుసంధానం కావడం ద్వారా రవాణా వేగవంతం కానుంది. విదేశాలనుంచి పోర్టు ద్వారా వచ్చే సరుకును తెలంగాణ, మహారాష్ట్రకు వేగంగా రవాణా చేసే సౌలభ్యం కలగనుంది. ఖమ్మం-విజయవాడ రహదారి కోసం కొన్నిచోట్ల భూసేకరణ జరగ్గా, మరికొన్ని చోట్ల భూసేకరణ జరగాల్సి ఉంది. ఈప్రక్రియ పూర్తయితే నేషనల్‌ హైవే అథారిటీ రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది.

Updated Date - 2023-03-16T01:54:55+05:30 IST