రాహుల్ సభకు కసరత్తు షురూ
ABN , First Publish Date - 2023-06-26T00:58:09+05:30 IST
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా త్వరలో ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహిరంగసభకు కసరత్తు షురూ అయ్యింది.
స్థలాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
సూర్యాపేటలో సీఎల్పీ నేత భట్టితో సమావేశం
పీపుల్స్‌మార్చ్ ముగింపు చిహ్నంగా 20 అడుగుల పైలాన
పొన్నెకల్ వద్ద నిర్మాణ పనులు ముమ్మురం
ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/ఖమ్మం సంక్షేమ విభాగం, జూన 25 : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా త్వరలో ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహిరంగసభకు కసరత్తు షురూ అయ్యింది. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని, 3లక్షలమందిపైగా జనాన్ని సమీకరించాలని ఆదివారం సూర్యాపేటలో జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో భట్టి వారికి సూచించారు. దీంతో జిల్లా నాయకులు సభ ఏర్పాట్లలో జిల్లా నిమగ్నమయ్యారు. మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు జావీద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు ఆదివారం సూర్యాపేట వెళ్లి భట్టిని కలిశారు. ఈ వారితో మాట్లాడిన భట్టి సభ విషయమై పలు సూచనలు చేశారు. సభ తేది సోమవారం సాయంత్రం ఖరారవుతుందని, వచ్చేనెల 2 లేదంటే 3వ తేదీల్లో ఉండబోతోందన్నారు. అనంతరం ఖమ్మం చేరుకున్న నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర ఈనెల 28న ఖమ్మం చేరుతుందని, ముగింపుసభకు రాహుల్‌గాంధీ హాజరవుతారన్నారు. అదేరోజు ఇతరపార్టీల నుంచి నాయకుల చేరికలుంటాయని, భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర ముగింపు చిహ్నంగా ఖమ్మంరూరల్ మండలం పొన్నెకల్ వద్ద 20 అడుగులు పైలాన నిర్మించబోతున్నామని.. ఆ నమూనాను విడుదల చేశారు. అనంతరం సభ కోసం ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎనఆర్ కళాశాల మైదానంతో పాటు వైరారోడ్డు సమీపంలో, వైఎ్‌సఆర్‌నగర్‌రోడ్డులోని ఖాళీస్థలాలను పరిశీలించారు. మరోవైపు పొన్నకల్ వద్ద పైలాన పనులు చురుగ్గా సాగుతుండగా రాయల నాగేశ్వరరావు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా యువజనకాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు హుస్సెన పాల్గొన్నారు.