జేకే ఓసీకి మార్గం సుగమం

ABN , First Publish Date - 2023-03-30T23:49:27+05:30 IST

బొగ్గు గనులకు పుట్టినిల్లయిన బొగ్గుట్ట(ఇల్లెందు)లో మరో ఓపెన్‌కాస్ట్‌ గని (ఓసీ) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొంతకాలంగా ఊరిస్తున్న కొత్త ఓసీకి అన్ని అడ్డంకులు తొలిగిపోవడంతో సింగరేణి యజమాన్యం ఏర్పాటు ప్రక్రియలో చివరి ఘట్టమైన అభిప్రాయ సేకరణకు సిద్ధమవుతోంది.

జేకే ఓసీకి మార్గం సుగమం

వచ్చే నెల26, 29న అభిప్రాయసేకరణ

ఇప్పటికే అటవీ శాఖ నుంచి వచ్చిన అనుమతులు

పుట్టినింట మరో ఓసీ ఏర్పాటుకు సిద్ధమైన సింగరేణి

ఇల్లెందుటౌన, మార్చి30: బొగ్గు గనులకు పుట్టినిల్లయిన బొగ్గుట్ట(ఇల్లెందు)లో మరో ఓపెన్‌కాస్ట్‌ గని (ఓసీ) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొంతకాలంగా ఊరిస్తున్న కొత్త ఓసీకి అన్ని అడ్డంకులు తొలిగిపోవడంతో సింగరేణి యజమాన్యం ఏర్పాటు ప్రక్రియలో చివరి ఘట్టమైన అభిప్రాయ సేకరణకు సిద్ధమవుతోంది. మరి కొద్ది నెలల్లో ప్రస్తుత జేకే5 ఓసీలో బొగ్గు నిల్వలు అడుగంటుతుండటంతో సింగరేణి అధికారులు రెండేళ్లుగా జేకేఓసీ (రొంపేడుఓసీ)ని ఏర్పాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అటవీశాఖ అనుమతులు రాగా.. చివరి అంశంగా ఉన్న ప్రాజాభిప్రాయసేకరణను వచ్చేనెల 26, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. 26న భద్రాద్రి జిల్లా పరిధిలోని ఇల్లెందు, 29న కారేపల్లి మండలం శాంతినగర్‌లో ప్రజాప్రాయసేకరణ నిర్వహించాలని, ఈ సభలకు ఇరు జిల్లాల కలెక్టర్లు హాజరవ్వాలంటూ సింగరేణి యజమాన్యం వారికి లేఖలను అందిస్తోంది. రొంపేడు ఓసీ ఏర్పాటైతే మరో 15ఏళ్ల పాటు ఇల్లెందు ఏరియా మనుగడకు తిరుగుండదని సింగరేణి అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఏరియా పరిధిలో కోయాగూడెం ఓసీ 2 నడుస్తుండగా ఫిట్‌3ని ప్రారంభించి ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కోయగూడెం, ఇల్లెందులో రెండు ఓసీలు ఉంటేనే ఇల్లెందు ఏరియాలో ఉద్యోగులు, కార్మికులు ఉంటారు. లేదంటే కొత్తగూడెం పరిధిలోకి వెళ్లే ప్రమాదం ఉండగా కొత్తగా జేకేఓసీ వస్తున్నందున ఇల్లెందు ఏరియాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు.

ప్రజాప్రాయ సేకరణకు సహకరించాలి

షాలేమురాజు, ఏరియా జీఎం

జేకేఓసీ ఏర్పాటుకు ఇల్లెందులోని అన్ని వర్గాలు, ప్రజలు రాజకీయపక్షాలు సహకరించాలి. రొంపేడు ఓసీ ఏర్పాటైతే ఇల్లెందుకు మనుగడ ఉంటుంది. గతంలో జేకే5ఓసీ ఏర్పాటులో కూడా అన్ని పక్షాలు సహకరించడం వల్లే ఓసీ ఏర్పాటైంది. కొత్త ఓసీలో గుర్తించిన నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తాం.

Updated Date - 2023-03-30T23:49:33+05:30 IST