నవమికి తప్పని ట్రా‘ఫికర్‌’

ABN , First Publish Date - 2023-03-18T23:48:46+05:30 IST

రామయ్య కల్యాణం కనులారా వీక్షించడానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ సమస్య ముచ్చెమటలు పెట్టిస్తోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే వాహనాలను నియత్రించడం అధికారులకు బ్రహ్మపదార్థంగా మారింది. అంతసేపు ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడిన భక్తులు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోతుండటం చీకాకు తెప్పిస్తోంది.

నవమికి తప్పని ట్రా‘ఫికర్‌’
గతంలో నవమి రోజున భద్రాచలంలో నిలిచిన వాహనాలు

బ్రహ్మోత్సవాల వేళ ప్రధాన సమస్యగా వాహనాల రద్దీ

ముందస్తు కార్యాచరణతోనే పరిష్కారం

భద్రాచలం, మార్చి 18: రామయ్య కల్యాణం కనులారా వీక్షించడానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ సమస్య ముచ్చెమటలు పెట్టిస్తోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే వాహనాలను నియత్రించడం అధికారులకు బ్రహ్మపదార్థంగా మారింది. అంతసేపు ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడిన భక్తులు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోతుండటం చీకాకు తెప్పిస్తోంది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన శ్రీరామనవమిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణాన్ని తిలకించి తిరిగి భక్తులు తమ గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో ఏటా తిప్పలు తప్పడం లేదు. ప్రతీ సంవత్సరం అధికార యంత్రాంగం సమీక్షలైతే నిర్వహిస్తోంది కాని దీనికి పూర్తిస్థాయి పరిష్కారాన్ని కనుగొనలేకపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏటా అదే సమస్య

ఫలితంగా స్వామి వారి కల్యాణాన్ని పురస్కరించుకొని దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తగణంతో భద్రాద్రి పట్టణ పురవీధులు వాహనాలు భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ ప్రధాన సమస్యగా నిలుస్తోంది. భద్రాద్రి గోదావరి వారధి నుంచి కూనవరం రోడ్డులోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు వరకు, అంబేద్కర్‌ సెంటరు నుంచి చర్ల రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతీ ఏడాది ఐదు గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను అధికమించేందుకు అధికారులు ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రత్యేక పార్కింగ్‌ ఎక్కడ?

తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే టీఎస్‌ ఆర్టీసీ, ఆంధ్రనుంచి వచ్చే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులను నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసేలా చూడటంతో పాటు ప్రధాన రహదారులపై బస్సులు ఆగకుండా చర్యలు చేపట్టాలి. సారపాక భద్రాచలం వైపు వారధిపై వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్‌ పోలీసు అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ఐపీఎస్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో చేస్తే ట్రాఫిక్‌ ఆటంకాలను అధికమించే పరిస్థితులు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా భద్రాద్రి కి వచ్చే రామ భక్తులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని భద్రాద్రివాసులు కోరుతున్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

జిల్లా అధికారులతో కలెక్టర్‌ అనుదీప్‌ సమీక్ష

ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టరు అనుదీప్‌ అధికారులు ఆదేశించారు. భద్రాచలం సబ్‌కలెక్టరు కార్యాలయంలో శనివారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారుకు ఒక జిల్లాస్థాయి అధికారిని బాధ్యులుగా నియమించినట్టు తెలిపారు. అలాగే భక్తులు తమకు కావాల్సిన గదులను, కల్యాణం, పట్టాభిషేకం టికెట్లను ఆనలైనలో బుక్‌ చేసుకోవాలని తెలిపారు. పట్టణంలో 29 నుంచి 31 వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను 25జోన్లుగా విభజించి ప్రతి జోనకు ఒక ఎంపీఈవో, నలుగురు కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. మంచినీటి సరఫరాకు 200 తాగునీటి కుళాయిలు, మంచినీటి పరీక్షల నిర్వహణకు 12మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలు, అగ్నిని చల్లార్చే పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఆ శాఖ అధికారిని ఆదేశించారు. రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, భక్తుల వాహనాల పార్కింగ్‌కు ఐదు ప్రాంతాలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. చిన్నారుల జేబుల్లో ఫోననెంబర్‌ చీటీలను పెట్టాలని, తప్పిపోయిన సందర్భంలో సులువుగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడానికి వీలుంటుందని భక్తులకు సూచించారు. హోటల్‌ యజమానులు నిర్దేశిత ధరలకే ఆహార పదార్ధాలను విక్రయించాలని భక్తుల సౌకర్యార్థం తలంబ్రాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా 70కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టరు వెంకటేశ్వర్లు, ఏఎ్‌సపీ పరితోష్‌ పంకజ్‌, దేవస్థానం ఈవో రమాదేవి, డీఆర్‌వో అశోకచ క్రవర్తి, ఆర్డీవో రత్నకళ్యాణి, అన్ని శాఖల జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:48:46+05:30 IST