అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర

ABN , First Publish Date - 2023-03-18T23:45:29+05:30 IST

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆరుగాలం శ్రమించి.. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు.. చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. పంట కాపు చేతికొచ్చే సమయంలో ఊహించని విధంగా వచ్చిన వాన, ఈదురుగాలులకు పొలంపై మొక్కజొన్న, బొప్పాయి, తదితర పంటలు నేలవాలాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న తడిశాయి.

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర

17Enk05.jpgఏన్కూరులో తడిసిన మిర్చిని ఎత్తుతున్న రైతులు

అకాల వర్షంతో రూ.కోట్లలో పంట నష్టం

అందేనా పరిహారం? లభించేనా భరోసా?

ప్రభుత్వ చేయూత కోసం ఎదురుచూస్తున్న రైతులు

ఖమ్మం, మార్చి 18 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆరుగాలం శ్రమించి.. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు.. చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. పంట కాపు చేతికొచ్చే సమయంలో ఊహించని విధంగా వచ్చిన వాన, ఈదురుగాలులకు పొలంపై మొక్కజొన్న, బొప్పాయి, తదితర పంటలు నేలవాలాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న తడిశాయి. ఈ క్రమంలో పంటలు రంగుమారి ధరలు తగ్గుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో శనివారం కూడా పలుచోట్ల భారీవర్షం కురిసింది సత్తుపల్లి మండలంలో భారీవర్షం పడగా, ఇతర మండలాల్లో ఆకాశంలో మబ్బులతో కూడి చిరుజల్లులతో వర్షం పడింది. సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు, కామేపల్లి తదితర మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో గత రెండురోజుల క్రితం భారీవర్షాల కారణంగా సుమారు 19వేల ఎకరాల్లో పంటలు నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. తద్వారా 9,200మంది రైతులు పంటలు నష్టపోయారు. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న 18,876 ఎకరాలు నష్టపోగా, పెసర తదితర పంటలు 53 ఎకరాల్లో నష్టపోయినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ప్రధానంగా కొణిజర్ల, బోనకల్‌, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, కామేపల్లి, కారేపల్లి, వైరా, ఏన్కూరు, తల్లాడ, తదితర మండలాల్లో పంటల నష్టం అధికంగా జరిగింది. మొక్కజొన్న రైతుకు ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపోతే, పప్పుధాన్యాల రైతులు కూడా ఎకరానికి రూ.20నుంచి30వేలు నష్టపోయారు. ఎకరానికి 40క్వింటాళ్లపైగా దిగుబడులు వస్తాయని తద్వారా రూ.70నుండి80వేల రాబడి ఉంటుందని లెక్కలు వేసుకున్న మొక్కజొన్న రైతులకు నిరాశే మిగిలింది. మండలాల వారీగా పరిశీలిస్తే ఖమ్మంరూరల్‌ 50 ఎకరాలు,కూసుమంచి10, నేలకొండపల్లిలో 325, బోనకల్‌ 6954, చింతకాని 894, మధిర 825, ముదిగొండ 3491, తల్లాడ 112, ఏన్కూరు 144,, కొణిజర్ల 4495, వైరా 1526, కామేపల్లి 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ ఈమేరకు ప్రతిపాదనలు పంపింది. అయితే మొక్కజొన్న పంటకు ప్రకృతివైపరీత్యాలతో నష్టం జరిగితే ప్రభుత్వ పరిహారం హెక్టారుకు రూ.8,333 మాత్రమే పరిహారం చెల్లించాలన్న నిబంధన ఉంది. ఇదికూడా పూర్తిస్థాయి పంట నష్టం జరిగినట్టు నిర్ధారణైతే పరిహారం వర్తిస్తుంది. రైతుల పంటనష్టం ఎకరానికే రూ.50వేల వరకుంటే ప్రభుత్వ సహాయం హెక్టారుకు రూ.8,333 ఉండడంతో ప్రభుత్వ పరిహారంతో రైతులకు పెద్దగా నష్టం తీరని పరిస్థితి. ఇక జిల్లాలో పెసర పంట కూడా సుమారు 53ఎకరాల్లో 31మంది రైతులు కోల్పోయారు. ప్రధానంగా మధిర, బోనకల్‌ తదితర మండలాల్లో పెసర పంటకు నష్టం జరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం పెసర పంటకు నష్టం జరిగితే హెక్టారుకు రూ.6,800చెల్లించాలని ఉంది. జరిగిన నష్టానికి అందే పరిహారానికి పొంతన ఉండని పరిస్థితి. అలాగే మిర్చి పంట కూడా కల్లాల్లో తడవగా.. ఉద్యానవనశాఖ అధికారులు మాత్రం మిర్చికి ఎక్కడా నష్టంలేదని తేల్చేశారు.

Updated Date - 2023-03-18T23:45:29+05:30 IST