పలుచోట్ల మోస్తరు వాన
ABN , First Publish Date - 2023-09-27T00:03:51+05:30 IST
ఉమ్మడి జిల్లాలో మంగళవారం మోస్తరు వర్షం పడింది. సత్తుపల్లిలో 3.5సెంమీ అత్యధిక వర్షపాతం నమోదవగా, మధిరలో 2.4, ఖమ్మం నగరంలో 2.25సెంమీ నమోదయింది. పాల్వంచ మండలం యానంబైలులో 1.98, అశ్వారావుపేటలో 1.95, దమ్మపేట మండలం మల్కారంలో 1.90, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం ప్రకాష్‌న
గుండాల మండలంలో పిడుగుపాటు..
రైతు మృతి తిరుమలాయపాలెంలో ఇద్దరు కూలీలకు గాయాలు
ఖమ్మం / కొత్తగూడెం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో మంగళవారం మోస్తరు వర్షం పడింది. సత్తుపల్లిలో 3.5సెంమీ అత్యధిక వర్షపాతం నమోదవగా, మధిరలో 2.4, ఖమ్మం నగరంలో 2.25సెంమీ నమోదయింది. పాల్వంచ మండలం యానంబైలులో 1.98, అశ్వారావుపేటలో 1.95, దమ్మపేట మండలం మల్కారంలో 1.90, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం ప్రకాష్‌నగర్ ప్రాంతంలో 1.3, కామేపల్లి మండలం లింగాలలో 1.28, వేంసూరులో 1.25 సెంమీ వర్షపాతం నమోదైంది. దమ్మపేట, చింతకాని, తల్లాడ, నేలకొండపల్లి, కారేపల్లి తదితర ప్రాంతాల్లోనూ చిరుజల్లులు పడ్డాయి. ఈ క్రమంలో ఖమ్మం నగరం, కొత్తగూడెం పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పిడుగుపాటుకు రైతు బలి గుండాల మండలం కొడవటవంచ గ్రామంలో పిడుగుపడి ఓ రైతు మృతిచెందాడు. కొడవటంచ గ్రామానికి చెందిన గొగ్గల రామస్వామి (54) పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో వర్షం ప్రారంభం కావడంతో పశువులను ఇంటికి తోలుకొస్తున్నాడు. అతడు ఏడు మెలికల వాగు కట్టు కాలువ సమీపంలోని వచ్చిన క్రమంలో దగ్గర్లోని ఓ చెట్టుపై పిడుగు పడడంతో రామస్వామి స్పృహకోల్పోయాడు. గమనించిన సమీపంలోని పశువులకాపరులు కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు సమాచారమివ్వగా.. వారు వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో గుండాల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామస్వామి మృతి చెందినట్టు నిర్ధారించారు. రామస్వామికి భార్య, నలుగురు పిల్లలున్నారు. అలాగే టేకులపల్లి మండలం గంగారంపంచాయతీ సంపతనగర్‌లో పిడుగుపాటుకు ఓ దుక్కిటెద్దు మృత్యువాతపడింది. కలుపు తీస్తుండగా పడిన పిడుగు.. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో పొలంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు తీవ్రంగా గాయపడ్డారు. దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన మద్ది వీరయ్యకు చెందిన మిరపతోటలో అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూలీలు కలుపుతీస్తున్నారు. మధ్యాహ్నం 1గంట సమయంలో ఉరుములు మెరుపులుతో వర్షం ప్రారంభం కావడంతో కూలీలంతా సమీపంలోని వేపచెట్టుకిందకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ చెట్టు సమీపంలో పిడుగుపడటంతో గోకినపల్లి సావిత్రి, మద్ది వరమ్మ స్పృహ కోల్పోయారు. దీన్ని గమనించిన స్థానికులు 108వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.